బ్రెయిన్‌లో మార్పులే.. ఆత్మహత్యలకు కారణం!
ఆ నెట్ వర్క్‌లు మారిపోతే తీవ్ర నెగెటివ్ ఆలోచనలు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టడీ
సూసైడ్ చేసుకోవాలన్న ప్రయత్నం ఎందుకు చేస్తారు? విపరీతమైన నెగెటివ్ ఆలోచనల వల్ల. నెగెటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? సమస్యలకు ఏ పరిష్కారమూ తోచకపోవడం వల్ల లేదా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితిలో ఎమోషన్స్‌ను కంట్రోలో చేసుకోలేని స్థితిలోకి జారి పోవడం వల్ల. ఆత్మహత్యలకు ఇవే కారణాలు అయినా.. వీటి వెనక అసలు సూత్రధారి మాత్రం మన మెదడేనట! బ్రెయిన్‌లోని రెండు కీలకమైన నెట్ వర్క్‌లలో మార్పులు జరగడం వల్లే మనుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ రీసెర్చర్లు అంటున్నారు. మెదడులో కొన్ని భాగాల నిర్మాణం, విధులు, మాలిక్యులర్ మార్పుల వల్ల ఆత్మహత్య చేసుకునే ప్రమాదం పెరుగుతుందా ? అన్న కోణంలో వీరు పరిశోధన చేశారు.
ప్రతి 40 సెకన్లకు ఒకరు సూసైడ్
ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారని కేంబ్రిడ్జ్ వర్సిటీ రీసెర్చర్లు వెల్లడించారు. అంటే ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారని తేలింది. అయితే 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు వారి మరణాల్లో సూసైడ్ రెండో ప్రధాన కారణమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. కేన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్, బర్త్ డిఫెక్ట్స్, స్ట్రోక్, న్యుమోనియా, ఇన్ ఫ్లుయెంజా, క్రానిక్ లంగ్ డిసీజ్ వంటి రోగాల వల్ల చనిపోయే టీనేజర్ల కంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న టీనేజర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. వీరి రీసెర్చ్ వివరాలు ‘మాలిక్యులర్ సైకియాట్రీ’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.