హైదరాబాద్
హరితహారం పథకం కింద నాటిన లక్షలాది మొక్కలు సంరక్షణ చర్యలు లేక చనిపోతుండటంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్‌గా స్పందించింది. నాటిన మొక్కలు, వాటిలో బతికినవాటి లెక్కలు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. సీఎం కార్యాలయం నుంచి ఉదయమే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఫోన్‌కాల్స్ వెళ్లాయి. హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ స్పష్టంచేశారు. రక్షణ ఏర్పాట్లు, నిర్వహణ లేక చనిపోతున్న మొక్కల్లో ప్రధానంగా పురపాలక, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహిస్తున్నవే ఎక్కువగా ఉన్నాయని ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా ‘ఈనాడు’ కథనంలో పేర్కొన్న ప్రాంతాల్లో మొక్కల పరిస్థితి గురించి ప్రత్యేకంగా అడిగారు. నాటిన మొక్కలెన్ని.. వాటిలో బతికినవి ఎన్నో వివరాలు పంపించాలని సీఎం కార్యాలయం ఆదేశించింది. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓలకు స్పష్టం చేశారు. చనిపోయిన, ఎదుగుదల సరిగా లేని వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు అటవీశాఖ ఉన్నతాధికారులు పురపాలక శాఖ అధికారులతో మాట్లాడారు. నిర్వహణ సమస్యలు, రక్షణ ఏర్పాట్లు లేని మొక్కలు నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా ఉన్నాయని వీటి సంరక్షణ బాధ్యత మీ శాఖదేనని స్పష్టంచేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో చౌటుప్పల్ మండలంలో ఎంపీడీఓతో పాటు అటవీశాఖ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది దండుమల్కాపురం, ఆరెగూడెంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించారు. ఆరెగూడెంలో భూగర్భజలాల కాలుష్యం కారణంగా మొక్కలు చనిపోతున్నది నిజమేనని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.