ప్రైవేటు ఆస్పత్రులను భాగస్వాములను చేశారా? దీనిపై వివరణ ఇవ్వండి

 స్వైన్‌ఫ్లూ నివారణపై   ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


 హైదరాబాద్‌,ఆరోగ్యజ్యోతి: స్వైన్‌ఫ్లూ నివారణలో ప్రైవేటు ఆస్పత్రులను భాగస్వాములను చేశారో? లేదో? స్పష్టంగా వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ విజృంభించకుండా చర్యలు తీసుకోవడంపై జిల్లా వైద్యాధికారులకు అవగాహన కల్పించాలని సూచించింది. స్వైన్‌ఫ్లూ నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డా.కరుణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటరు దాఖలు చేస్తూ 15 లక్షల కరపత్రాలను, 2 లక్షల పోస్టర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలనూ ఇందులో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు కౌంటరు దాఖలు చేస్తూ రాష్ట్రంలో ల్యాబ్‌ల ఏర్పాటు నిమిత్తం రోగ నియంత్రణ జాతీయ కేంద్రం అనుమతి కోరామని, రావాల్సి ఉందన్నారు.గత ఆదేశాల మేరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేకపోయామని వివరించారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు వినియోగించే వ్యాక్సినేషన్‌ వికటిస్తుందన్న భయంతో ప్రజలు ఆసక్తి చూపడంలేదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ స్వైన్‌ఫ్లూ నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా చర్యలు తీసుకుంటామన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణకు నమూనాల సేకరణ, ధ్రువీకరణ తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పరీక్ష కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయకుంటే తీవ్రత ఎక్కువగా ఉంటుందని కోర్టు సహాయకుడైన సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్వైన్‌ఫ్లూ నివారణపై చేపట్టిన చర్యలపై సీఎస్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో సరైన ఆధారాలు కనిపించడంలేదని, వాటికి పత్రసహిత ఆధారాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. గత ఉత్తర్వుల్లో ప్రైవేటు ఆస్పత్రులను భాగస్వాములను చేయాలని సూచించామని, దాని ప్రస్తావన లేదని పేర్కొంది. ఏ మేరకు వాటికి భాగస్వాములను చేశారో వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది.