చెన్నై: అందం, అభినయంతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. 2020లో వీరి పెళ్లంటూ వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరు కలిసి అనేక మార్లు విహారయాత్రలకు కలిసి వెళ్లారు. విఘ్నేశ్ పలు సందర్భాల్లో నయన్‌పై ప్రేమను తెలిపారు. ఆమెతో పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను ప్రశ్నించగా.. ఆ విషయం తననే అడగండి అని సానుకూలంగా స్పందించారు.
కాగా నయన్ తొలిసారి ఆమె ప్రియుడి గురించి మాట్లాడారు. జీ సినీ తమిళ అవార్డుల వేడుకలో నయన్ మెరిశారు. ఉత్తమ నటి, శ్రీదేవి అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న ఆమె వేదికపై ప్రసంగిస్తూ.. తొలుత అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై ప్రేమ జీవితం, విఘ్నేశ్‌తో కలిసి తీసుకున్న ఫొటోల్ని షేర్ చేయడం గురించి ప్రశ్నించగా.. ఆయన ప్రేమతో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. అందులో అపారమైన శాంతి లభిస్తోందని వివరించారు. అంతేకాదు తన కలల్ని సాకారం చేసుకోవడంలో విఘ్నేశ్ ఎంతో తోడ్పడుతున్నాడని తెలిపారు. ఆమె వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఉన్న వదంతులపై స్పష్టత వచ్చింది.
2015లో ‘నానుమ్ రౌడీదాన్’ అనే చిత్రం ద్వారా నయన్, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేశ్ దర్శకత్వం వహించగా.. నయన్ కథానాయికగా నటించారు. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసి ప్రేమగా మారింది. నయన్ ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆమె నటించిన ‘దర్బార్’ జనవరి 9న విడుదల కాబోతోంది. విఘ్నేశ్-నయన్ కాంబినేషన్‌లో ఓ థ్రిల్లర్ రూపొందుతోంది.