చిరంజీవి - విజయశాంతి... సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో దాదాపు ఇరవై చిత్రాలొచ్చాయి. చాలా ఏళ్ల తరవాత వేదికపై వీరిద్దరినీ చూడడం అభిమానులకు ముచ్చటగా అనిపించింది. దానికి తోడు చిరంజీవి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. విజయశాంతిపై తన ప్రేమ, అభిమానం చూపించారు. చిరు - విజయశాంతి మధ్య జరిగిన సంభాషణ ఆకర్షించింది. విజయశాంతితో తన అనుబంధం గుర్తు చేసుకున్న చిరు ‘టి.నగర్‌లో మా ఇంటి ముందే ఉండేది. మా కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయింది. ఇద్దరం చాలా సినిమాలు చేశాం. తను నా హీరోయిన్’ అంటూ ఆ రోజుల్లోకి వెళ్లిపోయారు. అంతలోనే..‘నాకంటే ముందే రాజకీయాల్లోకి వెళ్లావ్ కదా..నన్ను అన్ని మాటలు ఎలా అనాలనిపించింది? నిన్ను నేను ఒక్కరోజైనా ఏమైనా అన్నానా. అనాలిఅనిపించలేదు’ అంటూ సరదాగా ఆట పట్టించారు. ‘నా ముందు అనకపోయినా వెనుక అన్నారేమో’ అని విజయశాంతి అడిగితే.. ‘నీ ముందు అనలేనివాడిని వెనుక ఏమంటాను’ అంటూ మరోసారి నవ్వేశారు చిరు. ‘రాజకీయాలు వేరు సినిమాలు వేరు. మీరు ఎప్పటికీ నా హీరోనే’ అని విజయశాంతి చెప్పడంతో సభలో చప్పట్లు మార్మోగాయి. ‘రాజకీయాలు మనుషుల్ని దూరం చేస్తే, సినిమాలు స్నేహితుల్ని మళ్లీ దగ్గర చేస్తాయి. ఇన్నేళ్ల తరవాత ఇక్కడ విజయశాంతిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. దీనంతటికీ కారణం మహేష్‌బాబు’’ అన్నారు చిరంజీవి.