వ్యాపారుల ఎన్‌పీఎస్‌కు స్పందన అంతంతే


దిల్లీ: వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం తీసుకొచ్చిన జాతీయ పింఛను పథకానికి (ఎన్‌పీఎస్‌) స్పందన కరవైంది. మార్చి నాటికి ప్రభుత్వం 50 లక్షల మందిని ఈ పథకంలో చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 25,000 మంది మాత్రమే మొగ్గుచూపారు. దిల్లీలో 84 మంది వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు నమోదు చేసుకున్నారు. కేరళలో వీరి సంఖ్య 59, హిమాచల్‌ ప్రదేశ్‌లో 54, జమ్ము కశ్మీర్‌లో 29, గోవాలో 2గా ఉంది. లక్షద్వీప్‌, మిజోరామ్‌ల్లో ఎవరూ ముందుకు రాలేదు. అత్యధికులు నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌ (6,765), ఆంధ్రప్రదేశ్‌ (4,781), గుజరాత్‌ (2,915), మహారాష్ట్ర (632), బిహార్‌ (583), రాజస్థాన్‌ (549), తమిళనాడు (309), మధ్యప్రదేశ్‌ (305), పశ్చిమ్‌ బంగ (234) ఉన్నాయి. ప్రధానమంత్రి లఘు వ్యాపారీ మాన్‌-ధన్‌ యోజన పేరిట ప్రారంభమైన ఈ పథకంలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. 18-40 ఏళ్ల వయసు ఉన్న వారు నమోదు చేసుకుంటే 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు కనీసం రూ.3000 పింఛన్‌ పొందొచ్చు.