మెల్‌బోర్న్: తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా వ్యాధిని నిలువరించగల సరికొత్త టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిమెన్షియా, అల్జీమర్స్‌కు కారణమయ్యే ప్రోటీన్ నిల్వలను తొలగించగల ఈ టీకాను తాజాగా ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఎలుకల్లో విజయవంతంగా పరీక్షించారు. మరో రెండేళ్లలో మనుషులపై కూడా దాన్ని పరీక్షించనున్నారు. సాధారణంగా 'హైపర్‌ఫాస్ఫోరిలేటెడ్ టా ప్రోటీన్స్'తో కూడిన బీటా-అమైలాయిడ్ ఫలకాలు అధికంగా పోగుపడటంతో నాడీకణాలు క్షీణించి, వ్యక్తులు అల్జీమర్స్ వ్యాధి బారినపడతారు. అల్జీమర్స్‌తో డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. తాము రూపొందించిన టీకా బీటా-అమైలాయిడ్ ఫలకాలు పోగుపడకుండా అడ్డుకొని, డిమెన్షియాను నివారిస్తుందని పరిశోధకులు తెలిపారు.