వైద్య ఫీజుల ఖరారుకు సన్నాహాలు

హైదరాబాద్‌,ఆరోగ్యజ్యోతి: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సహా మెడికల్‌ పీజీ, ఇతర సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫీజు పెంపునకు సన్నాహాలు మొదలయ్యాయి. మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీచేసింది. అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 2020–23 కాలానికి ఫీజు ఖరారుకు సంబంధించి గత మూడేళ్ల తమ ఆడిట్‌ ఆర్థిక నివేదికలను సమర్పించాలని కోరింది. ఆడిట్‌ ఆర్థిక నివేదికలతోపాటు ఆన్‌లైన్‌ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల 31 అని తెలిపింది.


ఫీజు ప్రతిపాదనలను సమర్పించని లేదా స్పందించని కాలేజీలు 2020–23 కాలానికి సవరించిన ప్రకారం ఫీజు వసూలు చేయడానికి అనుమతి ఉండదని టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఫీజులను 2016లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. గతేడాది ప్రైవేటు వైద్య కళాశాలలు ద్రవ్యోల్బణం, ఉపాధ్యాయుల జీతాల పెరుగుదలను పేర్కొంటూ ఐదు శాతం ఫీజుల పెంపును కోరాయి. కానీ ప్రభుత్వం పెంచలేదు. 2017లో ప్రైవేటు మెడికల్‌ పీజీ ఫీజులను ఖరారు చేశారు. వాటిని కూడా ఇప్పుడు కొత్తగా ఖరారు చేయనున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 21 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, 11 ప్రైవేట్‌ డెంటల్‌ కాలేజీలు ఉన్నాయి.


ఐదు శాతం పెంచితే...?
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు ఉంటాయి. ఇక 35 శాతం బీ కేటగిరీ సీట్లు ఉంటాయి. మరో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే వీలుంది. ఇప్పుడు బీ, సీ కేటగిరీ సీట్లకు ఫీజు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుంది. ఐదు శాతం పెంచితే అదనంగా రూ. 57,750 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్‌ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 12,12,750 కానుంది. ఇక సీ కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుంది. ఐదు శాతంపెంచితే అదనంగా రూ. 1,15,500 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్‌ సీ కేటగిరీ ఫీజు రూ. 24,25,500 కానుంది. అలాగే డెంటల్‌ కోర్సులకూ ఐదు శాతం పెరగనుంది. ఐదేళ్లకు కలిపి చూస్తే పెంచిన ఫీజుల భారం విద్యార్థులపై అధికం కానుంది.