అక్కడ పురప్రముఖులు సింగరేణీయులే!

గోదావరిఖని: రాష్ట్రంలో ఈ నెల 22న జరగనున్న పురపాలక ఎన్నికల్లో సింగరేణి సిబ్బంది కీలకం కానున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 8 పురపాలక సంఘాలు, ఒక నగరపాలక సంస్థలో వారే గెలుపును నిర్దేశించనున్నారు. సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 46,782. రామగుండం నగరపాలక సంస్థతోపాటు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, నస్పూర్‌, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి పురపాలక సంఘాల పరిధిలో సింగరేణి కార్మికుల కుటుంబాల జనాభా ఎక్కువగా ఉంటుంది. కార్మికుల కుటుంబాలకు చెందిన సుమారు 2 లక్షల మంది ఓటర్లున్నారు. మెజారిటీ స్థానాల్లో వారి ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులు కార్మిక క్షేత్రాలను కేంద్రంగా చేసుకుని ప్రచారం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. గనిపై ఒకే షిఫ్టులో 300 నుంచి 400 మంది వరకు కార్మికులు ఒకే చోట కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడ ప్రచారం నిర్వహించేలా పార్టీలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి.