ముసుగు రాజకీయాల్ని ఎదుర్కొంటాం

హైదరాబాద్‌: తెరాస ముసుగులో మజ్లిస్‌ రాజకీయాలు చేస్తోందని..పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వీటికి అడ్డుకట్ట వేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. తెరాస నాయకుల్ని దొడ్డిదారిన కాంగ్రెస్‌ నుంచి బరిలో దింపి గెలిచిన తర్వాత సొంతగూటికి తీసుకువచ్చేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే అన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ గురువారమిక్కడ నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో లక్ష్మణ్‌ మాట్లాడారు. మజ్లిస్‌ పార్టీ ఎజెండా అమలుకు తెరాస, కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ‘‘గాంధీభవన్‌కు టూలెట్‌ బోర్డు ఉంటే.. తెలంగాణభవన్‌కు వెల్‌కం బోర్డు.. ఆ రెండు పార్టీల మధ్య తేడా ఇదే. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేమని.. తెలంగాణలో అయినా భాజపాకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా భాజపా విస్తరిస్తోందని.. దీంతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ చరిత్ర ఖతం అని మాట్లాడిన కేసీఆర్‌.. దిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతోనే ఉద్యోగుల సమ్మెకు ముగింపు పలికారన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 7న దిల్లీలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో చేరతారని చెప్పారు. తెరాస నుంచి పలువురు నేతలు కమలదళంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ డైరీని ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.