జగిత్యాల : జిల్లాలోని యువజన సర్వీసులు, క్రీడల శాఖ పరిస్థితి అధ్వానంగా తయారైంది. తెలంగాణ ఏర్పాటయ్యాక యువజన సర్వీసుల శాఖకు, క్రీడల శాఖను కలపడంతో ఏర్పాటైన డీవైఎస్‌వోశాఖ నామమాత్రంగా మారింది. ఇటు నిధుల్లేక, అటు విధులూ లేక నిష్క్రియాపర్వంగా మారింది. ఉద్యోగులు, సిబ్బందికి ఏటా రూ. 15 లక్షల మేరకు వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, కనీసం రూ.లక్ష విలువైన కార్యకలాపాలు నిర్వహించలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధిశాఖలో పరిస్థితులపై పరిశీలనాత్మక కథనం.
జిల్లాలో ఏర్పాటయిన యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యాలయం గత మూడేళ్లుగా నిస్తేజంగా మారింది. ఈ శాఖ ద్వారా నిర్వహించే కార్యకలాపాలకు మంజూరవుతున్న నిధులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనంలో కనీసం 20వ వంతు కూడా లేకపోవడం నిష్క్రియా పర్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఉద్యోగులు, సిబ్బందికి ఏటా వేతనాలు రూ.15 లక్షలు చెలిస్తుండగా, క్రీడా పోటీలు తదితర కార్యకలాపాల కోసం కేవలం రూ.65 వేల నిధులు మాత్రమే విడుదల అవుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఏటా నిర్వహించే యువజన ఉత్సవాల కోసం రూ.50 వేలు గతంలో మంజూరవగా, గత రెండేళ్లుగా అవి కూడా రావడం లేదు. ఇక వేసవి శిబిరాల నిర్వహణకు ఏటా రూ.50 వేలు, వివేకానంద జయంతికి రూ. 10 వేలు, క్రీడా పాఠశాలలో ప్రవేశానికి జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు మరో రూ.5 వేలు మొత్తం కలిపి రూ. 65 వేలు మంజూరు అవుతున్నాయి. ప్రస్తుతం ఆర్డీవో ఇన్‌ఛార్జి అధికారిగా వ్యవహరిస్తుండగా, తక్కిన జూనియర్ సహాయకునికి నెలకు వేతనం రూ.52 వేలు, అటెండర్‌కు రూ.62 వేలు, పొరుగుసేవల ఉద్యోగికి రూ. 15 వేలు, సీˆ్వపర్‌కు రూ. 3,500 చొప్పున మొత్తం కలిపి ఏడాకి రూ. 15 లక్షల వరకు అందుతున్నాయి. ఈ లెక్కన డీవైఎస్‌ఓ శాఖ ఆధ్వర్యంలో ఏడాది మొత్తం కలిపి రూ. 65 వేల విలువైన కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, ఇందుకోసం ఉద్యోగి, సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలు 23 రెట్లు ఉండటం గమనార్హం.
క్రీడా కోటాలో 29.. జిల్లాలో మాత్రం తొమ్మిదే
అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభను చాటేలా తీర్చిదిద్దాల్సిన క్రీడలు 59 వరకున్నాయి. వీటిలో క్రీడా కోటా కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించినవి 29 క్రీడలైతే, జిల్లాలో మాత్రం కేవలం 9 క్రీడలు, అథ్లెటిక్స్ మాత్రమే అందుబాటులో ఉండటం నిరాదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. వెండితెర, సామాజిక తదితర మాధ్యమాల్లో వివిధ రకాలైన క్రీడలు ఉత్సాహాన్ని నింపుతుండగా, క్షేత్రస్థాయిలో కేవలం 9 క్రీడలను మాత్రమే నేర్చుకునే పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో క్రీడాకారులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో మినీస్టేడియం, జిల్లా వ్యాప్తంగా ఔత్సాహికులైన క్రీడాకారులు, పెద్ద క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వసతులు, సౌకర్యాలు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో, అందుబాటులో ఉన్న క్రీడలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గత వైభవం ఏదీ?
గత ప్రభుత్వాల హయాంలో యువజన సర్వీసుల శాఖ ద్వారా నిరుద్యోగులైన యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు అందించడం జరిగేంది. రాజీవ్ యువశక్తి పథకం పేరిట ఉమ్మడి జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు రూ.1 కోటి విలువైన రుణాలు, చంద్రబాబునాయుడు హయాంలో యువశక్తి పథకం ద్వారా ఏటా రూ. 2 కోట్ల విలువైన స్వయం ఉపాధి రుణాలను అందజేశారు. సజావుగా లబ్ధిదారులకు అందజేసేందుకు బ్యాంకర్లతో సమావేశాలు, రుణాలను గ్రౌండింగ్ చేయడం తదితరాలతో బిజీగా ఉన్న యువజన సర్వీసుల శాఖ ప్రస్తుతం లాంఛనంగా మారింది.
వేసవి శిబిరాలకే పరిమితం
జిల్లాలో నిధులు లేక, విధులూ లేక యువజన సర్వీసులు స్తబ్దంగా మారగా, ఇక క్రీడలదీ అదే దుస్థితి. ఏటా మే 1 నుంచి 31 వరకు వేసవి శిబిరాలు నిర్వహించడం, ఆ తరువాత హైదరాబాద్ హకీంపేటలోని క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం నాలుగో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించడం వరకే శాఖ పరిమితమైంది. రెండేళ్ల కిందట రాష్ట్రస్థాయిలో బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీలు నిర్వహించగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే విధమైన పోటీలు చేపట్టలేకపోవడం క్రీడాకారులకు నిరాశ కలిగిస్తోంది. వేసవి శిబిరాల్లో సైతం మూస దోరణిలో వేసవి శిబిరాలకు మొత్తం కలిపి కేవలం రూ. 20వేలు విదిల్చి చేతులు దులుపుకోవడంతో క్రీడాకారులకు మరో అవకాశం లేకుండా పోతోంది. పాత క్రీడలు మినహా, తక్కిన వాటిపై ఆసక్తి పెంచేలా ఇతర క్రీడలను శిక్షణ శిబిరాలకు ఎంపిక చేయకపోవడంతో ఔత్సాహికుల్లో అసంతృప్తికి దారితీస్తోంది.
యువజన ఉత్సవాల ఊసేది?
యువజన సర్వీసుల విషయంలో కేవలం జనవరి 12న వివేకానందుని జయంతి వేడుకలు నిర్వహించడం వరకే పరిమితం కావడం యువతకు ప్రోత్సాహం కరవవుతోంది. ప్రతి ఏటా అక్టోబర్‌లో కార్యాచరణ ప్రకటించి, నవంబర్, డిసెంబర్ నెలల్లో యువజన కళోత్సవాలను పురస్కరించుకొని భరతనాట్యం, తబలా, ఫ్లూట్, జానపద నృత్యం, జానపద గానం తదితర 9 అంశాల్లో యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి జనవరి 12 నాటికి జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతోంది. 2011లో ప్రారంభమైన యువజన ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం మొదట్లో రూ. 80 వేలు మంజూరు చేయగా, ఆ తరువాత కుదించిన రూ. 50 వేలు సైతం గత రెండేళ్లుగా విడుదలకు నోచుకోకపోవడంతో, జిల్లాలో యువజన ఉత్సవాల ఊసే లేకుండా పోయింది.
మూడేళ్లలో ముగ్గురు అధికారులు
జిల్లా ఏర్పాటయిన సందర్భంగా 2016 అక్టోబర్ 11న యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధిశాఖ అందుబాటులోకి రాగా, అప్పటి నుంచి జిల్లా అధికారులు కనీసం ఏడాది పాటు కూడా సేవలను అందించలేకపోయారు. మొట్టమొదట డీవైఎస్‌ఓగా నియమితులైన మహ్మద్‌అలీ కేవలం 10 నెలల పాటు మాత్రమే విధులు నిర్వర్తించగా, ఆ తరువాత డీవైఎస్‌ఓగా వచ్చిన టి.శ్యాంప్రకాశ్‌కు డీఆర్‌వోగా బాధ్యతలు అప్పగించగా, ఆయన సైతం 11 నెలల పాటు మాత్రమే విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆర్డీవో, డాక్టర్ జి.నరేందర్, ఇన్‌ఛార్జి డీవైఎస్‌ఓగా శాఖను పర్యవేక్షిస్తుండగా, తగినంత మంది ఉద్యోగులు, సిబ్బంది లేకపోగా, అవసరమైన మేరకు నిధులు విడుదల కాకపోవడంతో శాఖలో ఒకింత స్తబ్దత నెలకొంది. జిల్లా కార్యాలయంలో ఇద్దరు జూనియర్ సహాయకులకు ఒక్కరే ఉండగా, మరో సీనియర్ సహాయకుడు, ఇద్దరు అటెండర్లకు ఒక్కరే ఉన్నారు. ఈత కొలనులో శిక్షణ ఇచ్చేందుకు ఐదుగురు శిక్షకులు, మరో ఇద్దరు సహాయకులు, ఈత కొలను నిర్వహణ, ఫీజుల వసూళ్లు తదితరాలకు మరో క్లర్క్ అవసరం కాగా, ఆ దిశగా నియామకాలు లేకపోవడంతో ఈత కొలను కళావిహీనంగా మారుతుండటం కార్యాలయం దుస్థితికి అద్దం పడుతోంది.
నిధులు సమర్థంగా వెచ్చిస్తున్నాం
-జి.నరేందర్, ఆర్డీవో, డీవైఎస్‌ఓ
యువజన సర్వీసులు, క్రీడల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సమర్థంగా ఖర్చు చేస్తున్నాం. జిల్లా, మండలస్థాయి పోటీలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తున్నాం. మరిన్ని నిధులు అవసరమైన పక్షంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.