న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలకుగాను ఐదు రాష్ట్రాలు కరోనా వైరస్ నుంచి పూర్తిగా విముక్తి పొందాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కరోనా విముక్త రాష్ట్రాల్లో సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర ఉన్నాయన్నారు. అసోం, మేఘాలయా, మిజోరాం రాష్ట్రాలు ఇంకా కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందలేదని మంత్రి జితేంద్ర చెప్పారు. అయితే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ఇటీవలి కాలంలో కొత్త కేసులేవీ నమోదు కాలేదని చెప్పారు.
మార్చి 30 నుంచి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు నిరంతరాయంగా నిత్యావసర సరుకులు చేరవేస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి చర్యలు చేపడుతున్నాయని, షిల్లాంగ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈశాన్య అభివృద్ధి మండలి అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తున్నదని ఆయన ప్రశంసించారు.