న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి) : ప్రపంచాన్ని, దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడుతోంది. వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోందనీ, రికవరీ రేటు 20.66 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి మంత్రుల బృందం శనివారం ఢిల్లీలో సమావేశమై దేశంలో పరిస్థితిపై సమీక్షించింది. గడచిన 24 గంటల్లో రోగుల సంఖ్యలో పెరుగుదల సగటున కేవలం 6 శాతం మాత్రమేనని (1429 కొత్త కేసులు) హర్షవర్ధన్ వెల్లడించారు. ఇది నెలరోజుల కిందట- 100 పాజిటివ్ కేసులు దాటిన తరువాత- నమోదైన అతి స్వల్ప వృద్ధి రేటు అని పేర్కొన్నారు. అయితే శుక్రవారం సాయంత్రానికి కొత్త రోగుల సంఖ్య 1752కు (7.48 శాతానికి) పెరిగింది. మొత్తం మీద కేసుల పెరుగుదల తక్కువగానే ఉంది తప్ప అనూహ్యంగా పెరగడం లేదని రెండ్రోజుల కిందట ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా- ఉదయం మంత్రుల బృందం సమావేశమయ్యే సమయానికి నమోదైన 24506 పాజిటివ్ కేసుల్లో 5062 మంది కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.సగటున కేసుల రెట్టింపు రేటు 9.1 రోజులుగా ఉందని పేర్కొంది. మరణాల రేటు 3.1 శాతంగా ఉందని తెలిపింది. లాక్‌డౌన్, పకడ్బందీగా కట్టడి కేంద్రాల అమలు, క్లస్టర్ మేనేజ్‌మెంట్ వల్ల ఇది సాధ్యమైందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యాపిని నిరోధించగలిగామని ప్రధాని ఏర్పాటు చేసిన 11 బృందాల్లో ఒకదానికి నేతృత్వం వహిస్తున్న సీకే మిశ్రా తెలిపారు. కాగా, సమావేశంలో అధికారులు కరోనా పరిస్థితిపై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశీయంగా పీపీఈలు, మాస్కుల తయారీ మొదలైందని, ప్రతీరోజూ లక్షకుపైగా పీపీఈలు, ఎన్95 మాస్కులు తయారవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌లలోనూ టెస్టింగ్ జరుగుతోందని అఽధికారులు వివరించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ వాడకాన్ని ప్రస్తుతానికి ఆపేయాలని ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
1.24 కోట్ల మంది వలంటీర్లు
కరోనాపై పోరులో వాలంటీర్లు, వనరులను సమీకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇప్పటి వరకూ సహకారం అందించడానికి 1.24 కోట్ల మంది ముందుకొచ్చారని తెలిపింది. వారి వివరాలను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో పంచుకుంటున్నామని, ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేసింది. వైద్య సిబ్బంది యోధులని, వారిని గౌరవించాలని, రక్షించుకోవాలని మంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. వలస కార్మికులు, పేదలకు ఆహారం అందించడంలో 92 వేల స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, పౌర సంఘాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.
తపాలా సేవలు అద్భుతం: మోదీ
లాక్‌డౌన్‌లో తపాలా సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర వస్తువులు, వైద్య పరికరాలను చేరవేస్తూ తపాలా శాఖ, సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ట్వీట్‌ను మోదీ రీ ట్వీట్ చేశారు.