హైదరాబాద్: బ్రిటన్‌లో కరోనా మహమ్మారికి మరో భారతీయ వైద్యుడు బలయ్యారు. వైద్యసేవలతో ప్రజల అభిమానం చూరగొన్న డాక్టర్ కమలేశ్ కుమార్ మాసన్ (78) కరోనా వల్ల తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. తోటి వైద్యులు, రోగులు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులుల అర్పించారు. ఎస్సెక్స్‌లోని థరాక్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా డాక్టర్ కమలేశ్‌కు మంచి పేరుంది. స్థానిక ప్రజల కు ఆయనంటే అపార గౌరవముందని వైద్యవర్గాలు తెలిపాయి. థరాక్ లో గత 50 సంవత్సరాలుగా రోగులకు సేవలందిస్తూ, అండగా నిలిచిన డాక్టర్ కమలేశ్ మృతి తీరని లోటని నేషనల్ హెల్త్ సర్వీస్ చైర్మన్ ఖలీల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవలే భారత సంతతి చెందిన డాక్టర్లు జితేంద్రకుమార్ రాథోడ్, మంజీత్‌సింగ్ రియాత్, క్రిషన్ అరోరా కరోనా వల్ల మరణించారు. ఇలా భారత సంతతి ప్రజలు, శ్వేతేతరులు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా కరోనాకు బలికావడం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు.