హైదరాబాద్: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ మినహా మిగిలిన వైద్య సేవలను నిలిపివేశారు. దీంతో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో సకాలంలో వైద్యం అందక ఇటీవల ఓ గర్భిణి చనిపోయిన విషయం తెలిసిందే. కొన్ని ఆస్పత్రులు సేవలు అందిస్తున్నా అధికారులు అభ్యంతరాలు చెప్తున్నారు. మరికొన్ని చోట్ల వైద్యం అందించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించడానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సేవలందించాలో అందులో సూచించింది. ఆస్పత్రుల్లోని సిబ్బంది ఏ కేటగిరీల కిందకి వస్తారు.. కేటగిరీని బట్టి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను పేర్కొంది.
భవిష్యత్తులో కేసులు పెరిగితే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా కరోనా అనుమానితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లూ లక్షణాలతో వచ్చే వారి కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయాలని కోరింది. వారికి ప్రత్యేక బ్లాక్‌లలో పరీక్షలు నిర్వహించాలని కోరింది. ఆస్పత్రుల్లో ఏ విభాగాల్లో ఎలాంటి రిస్క్ ఉండవచ్చన్న విషయాలను మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. తక్కువ రిస్క్ ఉన్న విభాగాల్లో పనిచేసేవారు భౌతిక దూరం పాటించాలి. మూడు లేయర్ల మెడికల్ మాస్కును, గ్లోవ్స్‌ను ధరించాలి. మధ్యస్థ రిస్క్ ఉన్న విభాగాల్లో పనిచేసేవారు ఎన్-95 మాస్కులు, గాగుల్స్, గ్లోవ్స్, ఫేస్ షీల్డు ధరించాలి. ఇక శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే రోగులను తరలించే అంబులెన్స్ సిబ్బంది హైరిస్కులో ఉన్నట్లు పరిగణించారు. వారు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి. రోగులు, వారి సహాయకులు కచ్చితంగా మాస్కులు ధరించాలి.
మార్గదర్శకాలు
- కరోనా బ్లాక్ ఉన్న సాధారణ ఆస్పత్రిలోని ఓపీ విభాగం, డాక్టర్ చాంబర్‌ను తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతంగా గుర్తించారు.
- ఈఎన్‌టీ, డెంటల్ డాక్టర్ల చాంబర్లను మధ్యస్థ రిస్క్ ఉన్న విభాగాలుగా పేర్కొన్నారు.
- ఐసీయూలో ఉండే రోగులను చూడటం, మృతదేహాలను తరలించడం, అత్యవసర కేసులను చూడటం లాంటివి మధ్యస్థ రిస్క్ ఉన్న విభాగాలుగా గుర్తించారు.
- శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి చికిత్స అందించడాన్ని హై రిస్క్ ఉన్న విభాగంగా గుర్తించారు. వీరికి చికిత్స అందించే వైద్యులు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.