దేశ వ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్లు

న్యూఢిల్లీకరోనా ప్రభావిత హాట్‌‌స్పాట్లు లేదా రెడ్ జోన్ల పర్యవేక్షణ, వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్ జారీ చేసింది. రికవరీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో రెడ్ జోన్లను గుర్తించడంలో మార్పు ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లలో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లలో ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా యూపీలో 19, మహారాష్ర్టలో 14 రెడ్ జోన్లు ఉన్నట్లు తెలిపింది. ఈనెల 10 వరకు ఆయా జిల్లాల క్లాసిఫికేషన్​ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించాలని స్పష్టం చేసింది.


రాష్ర్టాలు ఏర్పాటు చేయొచ్చు..


‘‘కేసుల నమోదు, డబ్లింగ్ రేటు ఆధారంగా జిల్లాలను గతంలో హాట్‌‌స్పాట్లు లేదా రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్‌‌లుగా విభజించాం. ప్రస్తుతం రికవరీ రేటు పెరుగుతోంది. అందువల్ల కరోనా కేసులు, డబ్లింగ్ రేటు, పరీక్షల తీరు, సర్వైలెన్స్ ఫీడ్​బ్యాక్ ఆధారంగా జోన్లను వర్గీకరిస్తాం” అని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రీతి సుడాన్ తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాల సీఎస్​లకు లెటర్స్ రాశారు. రాష్ర్టస్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఫీడ్​బ్యాక్ తీసుకోవడం, అదనంగా అనాలసిస్ చేయడం ద్వారా.. రాష్ర్టాలు అవసరమనుకుంటే మరిన్ని రెడ్, ఆరెంజ్ జోన్లను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. అయితే జోన్లపై కొన్ని రాష్ర్టాలు అభ్యంతరం చెప్పాయని.. కానీ తాము క్లాసిఫై చేసిన జోన్లకు సడలింపు ఇచ్చే అధికారం రాష్ర్టాలకు లేదని స్పష్టం చేశారు. జోన్ల జాబితాను వారానికోసారి లేదా అంతకుముందే సవరిస్తామని, దీనిపై రాష్ట్రాలతో కమ్యునికేట్ చేస్తామని తెలిపింది.


 


జోన్లలో భారీగా తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 15 నాటికి 170 జిల్లాలు రెడ్ జోన్లలో ఉండగా, 23 శాతం తగ్గుదలతో ఇప్పుడు 130కి చేరింది. అయితే ఆరెంజ్ జోన్లు పెరగ్గా, గ్రీన్ జోన్లు తగ్గాయి. గ్రీన్ జోన్లు 356 నుంచి 319కి పడిపోయాయి. ఆరెంజ్ జోన్లు 207 నుంచి 284కు పెరిగాయి.