మరో 22.. రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కేసులు

 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి, మునిసిపల్‌, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శులతో మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. కట్టడి ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్‌ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలుపుతూ సీఎంకు నివేదిక అందజేశారు. గురువారం పాజిటివ్‌గా తేలినవారి కుటుంబాలన్నింటినీ ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉంచామని తెలిపారు. 


మలక్‌పేటలోనే ఏడుగురికి పాజిటివ్‌..


తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందినవారే ఏడుగురు ఉన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో చక్కెర ఏజెన్సీ వ్యాపారం చేసే ఇద్దరు సోదరులకు, వారి ఇంట్లో మరొకరికి ఇంతకుముందే కరోనా సోకగా.. గురువారం మరో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే మార్కెట్‌లో బిస్కెట్‌ వ్యాపారం చేసే మరో వ్యక్తికీ కరోనా సోకినట్లు తేలింది. ఇక కుషాయిగూడకు చెందిన ఓ హోల్‌సేల్‌ కిరాణ వ్యాపారి కుటుంబ సభ్యుల్లోనూ నలుగురికి వైరస్‌ సోకింది. వీరితోపాటు గడ్డి అన్నారం డివిజన్‌ పరిధిలోని పల్లీ వ్యాపారి కుటుంబంలో ఇద్దరికి, తిరుమల్‌నగర్‌కు చెందిన ఓ రిటైర్డ్‌ టీచర్‌ (75)కు, జల్‌పల్లి మునిసిపాలిటీ ఎర్రకుంటకు చెందిన వృద్ధురాలి (68)కి పాజిటివ్‌గా తేలింది. కాగా, కరోనాతో గురువారం మృతి చెందిన ముగ్గురికి ఇతర ఆరోగ్య సమస్యులున్నట్లు తేలింది.


 


వీరిలో రామంతాపూర్‌కు చెందిన(48) వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చేరిన 12 గంటల్లోనే షుగర్‌, బీపీ, స్థూలకాయం, న్యుమోనియాతో బాధపడుతూ చనిపోయాడు. ఇక వనస్థలిపురానికి చెందిన మరో వ్యక్తి(76) కూడా గుండె, కిడ్నీ, న్యుమోనియాతో బాధపడుతూ గాంధీలో చేరిన 24 గంటల్లోనే మృతి చెందాడు. జియాగూడకు చెందిన మరో మహిళ(44)ను గాంధీ ఆస్పత్రికి వెంటిలేటర్‌ మీదనే తీసుకువచ్చారు. వచ్చిన 6 గంటల్లోనే ఆమె చనిపోయింది. కాగా, గురువారం డిశ్చార్జ్‌ చేసిన వారిలో ఓ డాక్టర్‌(50) కూడా ఉన్నారు. ఆయన 20 రోజుల క్రితం తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. గ్రేటర్‌లో ప్రస్తుతం బయట పడుతున్న కరోనా కేసులకు లింక్‌లు ఎక్కడున్నాయనేది పసిగట్టడంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వ్యాపారులు, ఇతరులకు కూడా వైరస్‌ సోకుతుండడంతో వారి వివరాలు సేకరించడం ఇబ్బందికరంగా మారింది. పైగా ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కాకుండా కొత్త ప్రాంతాల్లో నమోదవుతుండడం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలోని ఉప్పల్‌ మండలం రామంతాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. బుధవారం పాజిటివ్‌గా నమోదైన వ్యక్తి నుంచి మిగిలిన వారికి సోకింది. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూర్‌ గ్రామంలో కరోనా పాజిటివ్‌గా తేలిన నిలోఫర్‌ ఆస్పత్రి నర్సు కూతురికి కూడా వైరస్‌ సోకింది. నర్సుకు ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 11 రోజులుగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంలేదు. ఇది ఆ జిల్లా ప్రజలకు ఊరటనిస్తోంది. ఇక సూర్యాపేట జిల్లాకు చెందిన మరో ఇద్దరు కరోనా బాధితులు కోలుకుని గురువారం డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 10కి చేరింది. ఇంకా 73 యాక్టివ్‌ కేసులుండగా.. 4,582 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 


 


ప్రశంసలు సంతోషకరం: ఈటల


కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషకరమని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ ఇక్కడ పర్యటిస్తున్న కేంద్ర బృందమే నివేదిక పంపినందున రాజకీయ విమర్శలకు తావులేదని పేర్కొన్నారు.