- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కఠినం
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు కొనసాగటం అనివార్యంగా కనిపిస్తున్నది. కరోనా కేసులు ఒకరోజు తగ్గడం, మరొకరోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించడమే మంచిదని ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 28 దాకా లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం కనిపిస్తున్నది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా మార్చి 22న రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్‌ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్‌డౌన్ అవసరమని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా 70 రోజుల సైకిల్ పూర్తిచేయడమే సబబు అని ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది.
ఈ 70 రోజుల సైకిల్ సుమారుగా మే 28తో పూర్తవుతుంది. గతంలో స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు సోకినప్పుడు కూడా 70 రోజుల సైకిల్‌ను పాటించినట్లు నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యశాఖ సిఫారసుమీద మంగళవారం సమావేశమయ్యే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా పూర్తిస్థాయిలో అమలుచేసే అవకాశం ఉన్నది. మిగిలిన జిల్లాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సడలింపులిస్తారు. వారం రోజుల తరువాత పరిస్థితిని మరోసారి సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకొంటారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని కొన్ని చానళ్లు నిర్వహించిన సర్వేలో ప్రజలు పెద్ద సంఖ్యలో అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానుకూలంగా చర్యలు తీసుకొని ప్రజల్ని ఇప్పటిదాకా కంటికి రెప్పలా కాపాడుతున్నారని, కరోనా ముప్పు ఇంకా తొలగలేదని.. అందువల్ల ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేతకు తొందరపడాల్సిన అవసరంలేదని రాష్ట్రంలోని వివిధ వర్గాలు అభిప్రాయపడుతుండటంతో ప్రభుత్వ నిర్ణయం కూడా ఆ దిశగానే ఉండే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలోని పేదలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇప్పటికే మే నెల రేషన్ కింద బియ్యాన్ని పంపిణీచేసింది, వివిధ రాష్ర్టాల వలస కార్మికులను ఆయా రాష్ర్టాలకు పంపించడానికి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నది. అందువల్ల లాక్‌డౌన్‌తో బడుగువర్గాలకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చన్నది అంచనా. లాక్‌డౌన్‌ను గట్టిగా అమలుచేయడంవల్లనే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వంతో సహా పలువురు నిపుణులు ప్రశంసించారు. ఈ కారణం వల్లే రాష్ట్రంలోని అనేక రెడ్‌జోన్లు ఆరెంజ్‌కు.. ఆరెంజ్ జోన్లు గ్రీన్‌జోన్లుగా మారాయి. కంటైన్మెంట్ జోన్లు బాగా తగ్గిపోయినాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను అమలుచేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడమే ఉత్తమమే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నాలుగు జిల్లాల్లోనే తీవ్రత
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని సీఎం కేసీఆర్‌కు సిఫారసుచేశారు. మిగిలిన జిల్లాల్లో కొవిడ్-19 కేసులతోపాటు కంటైన్మెంట్ జోన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారు.
సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో 8 గంటలపాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తదితర అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చాయి. సోమవారం రాష్ట్రంలో కేవలం 3 కరోనా పాజిటివ్ కేసులే నమోదవడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం వైద్యశాఖ అధికారులు తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,085 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలిందని, వారిలో 585 మంది కొవిడ్-19 నుంచి కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 471 మంది చికిత్స పొందుతున్నారని, 29 మంది మరణించారని తెలిపారు.
రాష్ట్రంలో నమోదయిన మొత్తం పాజిటివ్ కేసుల్లో 717 మంది (66.08 శాతం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలవారే ఉన్నారని, మృతుల్లో కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందినవారే 82.21 శాతం మంది ఉన్నారని వివరించారు. గత 10 రోజులుగా నమోదైన కేసుల్లో కూడా ఈ జిల్లాల్లోనే అత్యధిక శాతం నమోదయ్యాయన్నారు.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, ఇక్కల లాక్‌డౌన్‌ను ఏమాత్రం సడలించినా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నివేదికపై మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆంక్షలు కొనసాగించాలా? సడలించాలా? వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశమమున్నది. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా, వైద్యశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.