28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా వైరస్

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): కూరగాయలు విక్రయిస్తున్న 28 మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది. ఒక్క ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల్లో 28 మంది కూరగాయల వ్యాపారులకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. కరోనా వైరస్ కూరగాయల వ్యాపారులకు ఎలా సోకిందో దాని చైన్ గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఆగ్రా నగర ఎస్పీ రోహాన్ బోట్రే చెప్పారు. కరోనా వైరస్ సోకిన కూరగాయల వ్యాపారులు ఎక్కువ మంది బాసాయి, తాజ్ గంజ్ మండీల్లో కూరగాయలు విక్రయించేవారని అధికారులు చెప్పారు. కరోనా వచ్చిన కూరగాయల వ్యాపారులను క్వారంటైన్ కు తరలించారు. మండీని మూసేసిన అధికారులు కూరగాయలను ఇంటివద్దకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ఆగ్రా నగరంలోని 20 వార్డుల్లో ఇంటివద్దకే కూరగాయల పంపిణీని ప్రారంభించామని ఆగ్రా మండీ సెక్రటరీ శివకుమార్ రాఘవ చెప్పారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పండ్ల మార్కెట్ లోనూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.