హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పాజిటివ్ వ్యక్తులకు గాంధీ దవాఖానలో నాణ్యమైన సేవలు అందిస్తున్నది. ఖర్చుకు వెనుకాడకుండా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ఒక్కో బాధితుడిపై లక్షలు వెచ్చిస్తూ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నది. వైరస్ నిర్ధారణ పరీక్ష మొదలు కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు ఒక్కో వ్యక్తికి రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులకు దాదాపు రూ.36.54 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారికి రూ.16.24 కోట్లు ఖర్చయినట్టు అంచనా.
వ్యయమవుతున్నది ఇలా..
ఒక కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500 ఖర్చవుతున్నది. పాజిటివ్ కేసులకు చికిత్స అనంతరం మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇలా ఒక్కొక్కరికీ రూ.13,500 వ్యయమవుతున్నది. అనుమానితులను అంబులెన్స్‌లోనే దవాఖానకు తీసుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కోలుకొని డిశ్చార్జి అయిన వ్యక్తిని ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వమే వాహనం ఏర్పాటుచేస్తున్నది. దీంతో రవాణా ఖర్చు రూ.4 వేలకుపైగా అవుతున్నది. పాజిటివ్ వ్యక్తులకు కోలుకొనేవరకు కనీసం 80 వరకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ఉపయోగిస్తారు. ఈ కిట్లను ఒక్కసారి వాడితే తిరిగి వినియోగించే అవకాశం లేదు.
ఒక్కో కిట్ ధర రూ.2,500 వరకు ఉంటుంది. ఒక్కో వ్యక్తికి పీపీఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖర్చవుతుంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి అంతకన్నా ఎక్కువ మొత్తంలో పీపీఈ కిట్లు మార్చాల్సి ఉంటుంది. కొవిడ్ సోకినవారిలో రోగనిరోధకశక్తి పెంచేందుకు, వారికి యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ మందులు, ఫ్లూయిడ్స్, ఇతర మందులు అందించేందుకు రూ.50 వేలు అవుతున్నదని అంచనా. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నవారికి ప్రత్యేక మెనూతో బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. బాధితుల్లో రోగనిరోధకశక్తిని పెంచేలా ప్రతిరోజు ఉదయం అల్పాహారం, రెండుసార్లు భోజనం, డ్రైఫ్రూట్స్, పాలు, బ్రెడ్, నాలుగు వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు.
ఇందుకోసం రూ.55 వేల వరకు వ్యయమవుతున్నది. చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సబ్బులు, శానిటైజర్, ప్రత్యేక డ్రెస్ వంటి వాటికోసం రూ.27 వేలు ఖర్చవుతున్నది. కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల్లో వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని బట్టి చికిత్సకు సమయం పడుతున్నది. సాధారణంగా 14 రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అవుతారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నవారు 21 రోజులవరకు చికిత్స పొందిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం అధికంగా ఉన్నవారి చికిత్సకు ఎక్కువ మొత్తంలో వ్యయమవుతున్నది.
రాష్ట్రంలో మొత్తం కేసులు | 1061 |
శనివారం నమోదైన కేసులు | 17 |
మొత్తం కోలుకున్నవారు | 499 |
చికిత్స పొందుతున్నవారు | 533 |
మొత్తం మరణాలు | 29 |
కరోనా బాధితులకు అవుతున్న ఖర్చు
క్యాటగిరీ | ఖర్చు రూ.ల్లో |
వ్యాధి నిర్ధారణ పరీక్షలు | 13,500 |
రవాణా ఖర్చు | 4,500 |
పీపీఈ కిట్లు | 2,00,000 |
మందులు, ఫ్లూయిడ్స్ | 50,000 |
బలవర్ధక ఆహారం | 55,000 |
వస్ర్తాలు, ఇతరాలు | 27,000 |
మొత్తం | 3,50,000 |