స్వదేశానికి రావడానికి గల్ఫ్‌లో వేచిఉన్న 30 లక్షలమంది

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌' పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్‌కు సన్నాహాలు చేస్తున్నది. దీంట్లో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో, మూడు యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకురానున్నట్టు తెలిపింది. 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్టు పేర్కొంది. అయితే గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తమను తీసుకుపోవాలని 30 లక్షల మంది భారతీయ వలస కార్మికులు ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు. మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదయ్యాయి. 195 మరణాలు సంభవించాయి. దేశంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 40 రోజుల లాక్‌డౌన్‌ పూర్తి అయిన చైనా, ఫ్రాన్స్‌, ఇటలీలాంటి దేశాలతో పోల్చితే మన దగ్గర నమోదవుతున్న సగటు కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉండగా శ్రామిక ప్రత్యేక రైళ్ల ద్వారా గత ఐదురోజుల్లో దాదాపు 70 వేల మంది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు చేరవేసినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది.   


న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌ మిషన్‌' పేరిట కేంద్రం అతిపెద్ద తరలింపు పక్రియకు శ్రీకారం చుట్టింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇదే అతిపెద్ద తరలింపు ప్రక్రియ. ఈ మిషన్‌లో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో సుమారు 14,800 మందిని దేశానికి తీసుకురానున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి మంగళవారం తెలిపారు. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ప్రత్యేక విమానాలు 12 దేశాల నుంచి వారిని తరలిస్తాయని చెప్పారు. యూఏఈ, బ్రిటన్‌, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను దశల వారీగా తీసుకొస్తామన్నారు. యూఏఈకి పది విమానాలు, అమెరికా, బ్రిటన్‌, మలేషియా, బంగ్లాదేశ్‌కు ఏడు చొప్పున, సౌదీ అరేబియా, కువైట్‌, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌కు ఐదు చొప్పున, ఖతార్‌, ఒమన్‌, బహ్రెయిన్‌కు రెండు చొప్పున విమానాలను పంపనున్నట్లు చెప్పారు. అబుదాబి-కొచి, దుబాయ్‌-కోజికోడ్‌ ప్రత్యేక విమానాలు కేరళకు మొదటగా గురువారం చేరుతాయని యూఏఈలోని భారత రాయబారి పవన్‌ కపూర్‌ తెలిపారు. కాగా, భారత్‌కు తిరిగివచ్చేందుకు సుమారు 2 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర వైద్యం అవసరమైనవారు, పర్యటనలకు వెళ్లి చిక్కుకున్న వారు, ఉపాధి కోల్పోయి.. వీసా గడువు ముగిసిన వలస కార్మికులు, విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మే 13 తర్వాత మరిన్ని విమానాల ద్వారా మరికొందరిని తీసుకువస్తామని పేర్కొన్నారు. రెండో దశ తరలింపులో (మే 13 తర్వాత) ప్రైవేటు సంస్థలకు చెందిన విమానాలు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. విమాన ప్రయాణ ఛార్జీలను వారే భరించాలని, నామమాత్రం ఖర్చులు మాత్రమే ఉంటాయని చెప్పారు. తమ రాష్ర్టాలకు చేరిన తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, ఆరోగ్యసేతు యాప్‌ను తప్పక డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. యూఏఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ‘సముద్ర సేతు’ పేరిట మూడు యుద్ధ నౌకలను పంపినట్లు నావికా దళం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక్కోనౌకలో దాదాపు వెయ్యి మందిని కేరళలోని కొచికి చేరవేస్తామని తెలిపింది. గతంలో ఇరాక్‌-కువైట్‌ మధ్య 1990లో జరిగిన మొదటి గల్ఫ్‌ యుద్ధం సమయంలో కువైట్‌లో చిక్కుకుపోయిన దాదాపు 1.7 లక్షల మంది భారతీయుల్ని విమానాల ద్వారా ప్రభుత్వం స్వదేశానికి తరలించింది. ఆ తర్వాత మళ్లీ ఇదే అతిపెద్ద తరలింపు ప్రక్రియ.