భారత్‌లో కరోనా ప్రభావంపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తాజా అప్‌డేట్

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): భారత్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్ అమలుకు సంబంధించి కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రెస్‌మీట్ నిర్వహించింది. భారత్‌లో గత 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ స్థాయిలో కరోనా నుంచి కోలుకోవడం ఇదే ప్రథమమని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 27 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,553 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం భారత్‌లో నమోదైన కేసుల సంఖ్య 42,533కు చేరిందని కేంద్రం ప్రకటించింది. ఇక.. లాక్‌డౌన్ అమలుకు సంబంధించి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాత్సవ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. అంతరాష్ట్ర సరుకుల రవాణాకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని రాష్ట్రాలకు స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు. సరుకుల రవాణా సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం నంబర్ 1930, హెల్ప్‌లైన్ నంబర్ 1033కు కాల్ చేసి డ్రైవర్స్ ఫిర్యాదు చేయొచ్చని శ్రీవాత్సవ చెప్పారు. లాక్‌డౌన్ అమలు సమయంలో షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, సెలూన్స్, స్పాలు తెరిచేందుకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. మతపరమైన ప్రార్థన మందిరాలు కూడా మూసివేసే ఉంటాయని తెలిపారు. ఎయిర్, ట్రైన్, మెట్రో సేవలు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో అందుబాటులో ఉండవని ఆమె ప్రకటించారు.