న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఢిల్లీలో కేవలం 1000 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. సరిగ్గా నెల రోజుల కాలంలో ఆ కేసుల సంఖ్య 7 వేలకు పైగా చేరింది. గత పది రోజుల నుంచే పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 310 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 63 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా కేసుల్లో మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీలో ఇప్పటి వరకు 7,233 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ నుంచి కోలుకుని 2,129 మంది డిశ్చార్జి కాగా, 73 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలో సడలింపులు ఇచ్చిన తర్వాతే కరోనా కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత వారం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు సమయం ఆసన్నమైందని చెప్పిన విషయం విదితమే. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, బాధితులు కూడా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్తున్నారని తెలిపారు.