కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎడాపెడా మార్చేస్తున్నది. బీభత్స భయానక స్థితిలోకి మానవజాతిని నెట్టివేస్తున్నది. కనివిని ఎరుగని రీతిలో మానవ సంబంధాలనే కాదు దేశాల మధ్య సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నది. వైరస్‌కు చాతనైంది ఒక్కటే.. దూరాలను పెంచడం. ఆ పని విజయవంతంగా కొనసాగిస్తున్నది. ప్రపంచీకరణ వల్ల భూగోళం కుగ్రామమైంది అని అంతా మురిసిపోయారు. కానీ మళ్లీ ఎవరికివారే కరోనా తీరే అన్నట్టుగా తయారైంది. గోడలు పగలగట్టి సరిహద్దులను చెరిపేసిన ప్రపంచంలో మళ్లీ తేడాలు వస్తున్నాయి. గ్లోబలైజేషన్ వద్దు.. లోకలైజేషన్ ముద్దు అనే అభిప్రాయం ముందుకు వచ్చింది. ఉదాహరణకు అమెరికా చైనా మీద ఆధారపడొద్దని అనుకుంటున్నది. కారణం ఏదైనా ఉత్పత్తి ఇక స్థానికంగానే జరిగితేనే బాగుంటుందని వినవస్తున్నది. కరోనా తెచ్చిన మరో మార్పు ఏమిటంటే.. అంతర్జాతీయవాదం వెనుకతట్టు పట్టి జాతీయవాదం ముందుకు వస్తున్నది. ఇంకో దేశం గురించి మనకెందుకు.. మనదేశం సంగతి మనం చూసుకుంటే చాలు. వ్యాక్సిన్ అభివృద్ధిలో అంతా కలిసి పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. కానీ దేశాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. అదిగో టీకా ఇందిగో మందు అన్నట్టుగా ఏ దేశానికి ఆ దేశం తానే ముందు కనిపెడుతున్నట్టు చెప్పుకుంటున్నాయి. స్వేచ్ఛా రహదారులుగా వికసించిన సరిహద్దులు మళ్లీ ముళ్లకంపలు అవుతున్నాయి. తనిఖీలు, అడ్డగింపులతో దుర్భరంగా తయారవుతున్నాయి. కలవారు మేడల్లో బందీలై ఆపసోపాలు పడుతుంటే.. లేనివారు వీధుల్లోపడి నరకాన్ని చవిచూస్తున్నారు. ధనికపేద తేడాలను కరోనా ప్రస్ఫుటంగా బయటపెట్టింది. పేదలకు గల బతికే హక్కును తోసిరాజంటున్నది. ఆర్థిక సంక్షోభాన్ని కారణంగా చూపి అమెరికా లాంటి దేశాల్లో నియంత్రణలను గాలికి వదిలేస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని పేదలు మాత్రం వెనుకకు తగ్గితే ఆకలి.. ముందుకు సాగితే రోగభయం మధ్యన నలిగిపోతున్నారు. కరోనా కథలో ఇవి తొలి అధ్యాయాలు మాత్రమే. ముందుముందు ఇంకా ఏమేం చూడాలో అని భూమి బిక్కుబిక్కుమంటున్నది.