న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి రోజువారీ హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 24 గంటల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. అంతేకాదు, కరోనా మరణాల సంఖ్య కూడా భారత్‌లో భారీగా పెరిగింది. 24 గంటల్లో భారత్‌లో కరోనా బారిన పడి 195 మంది మరణించినట్లు లవ్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 1,568కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,020 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 27.41శాతంగా ఉన్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది.