ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగినా అలవాటులో పొరపాటుగా రోజువారీ పద్ధతులే పాటిస్తాం. మొలకల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయని తెలిసీ రోజూ తీసుకోవాలనుకుంటూనే అలసత్వం వహిస్తుంటాం. అలాకాకుండా నియమబద్ధంగా మొలకలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.
మొలకల్లో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, క్యాల్షియం పీచు పదార్థం, ఫోలేట్స్, ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ఉన్నాయి. అందుకే మొలకలు కొంచెం తిన్న వెంటనే కడుపు నిండిపోతుంది. దీంతో కేలరీలు పెరగవు. తేలిగ్గా బరువు తగ్గొచ్చు. మామూలు విత్తనాల్లో కంటే మొలకల్లో విటమిన్ 'ఎ' ఎనిమిది రెట్లు, 20 రెట్లు పోషక విలువలు అధికంగా ఉంటాయి. శరీరానికి కావలసిన ఎంజైమ్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఉడకబెడితే ఎంజైములను నష్టపోతాము. అందుకని పచ్చివే తినడం మంచిది. వీటిలో మాంసకృత్తులు అధిక స్థాయిలో ఉండటం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందుతాయి. ఈ మాంసకృత్తుల్లో జంతు సంబంధ మాంసంలో ఉండే కొవ్వు, కొలెస్టరాల్, క్యాలరీల బాధ ఉండదు.
విటమిన్ 'సి' అధికంగా ఉండి జుట్టు పెరుగడానికి ఉపయోగపడతాయి. శరీరం మెరుపును సంతరించుకుంటుంది. గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేసి, బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల టాక్సిన్స్‌ను తొలగించి, మెటబాలిజం రేటును పెంచుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన న్యూట్రీషన్స్ అందుతాయి. శరీరానికి కావలసిన ఆల్కైజెస్‌ను అందించి, క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులను నివారిస్తాయి.
మొలకలు తీసుకుంటే త్వరగా కడుపు నిండుతుంది. తేలిగ్గా జీర్ణమౌతాయి.
ఇవి చౌకగా ఉండి అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారం. అందుకే అందరం మొలకలు ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
- 20 రెట్లు పోషక విలువలు అధికం
వ్యాసకర్త ..ఏ. పుష్ప లత...ఆదిలాబాద్