హెచ్‌ఐవీ, డెంగ్యూ తరహాలో కరోనాకూ వ్యాక్సిన్‌ రాకపోవచ్చు

డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడి వ్యాఖ్య


లండన్‌: కొవిడ్‌-19కి సంబంధించి ప్రస్తుతం సుమారు వందకుపైగా వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. మరికొన్ని మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌ఓ) చెందిన నిపుణుడు ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఐవీ, డెంగ్యూ తరహాలోనే కరోనాకు కూడా ఎప్పటికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవచ్చని పేర్కొన్నారు. ‘ఇప్పటికీ కొన్ని వైరస్‌లకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. వ్యాక్సిన్‌ వస్తుందా, రాదా అన్నది మనం కచ్చితంగా చెప్పలేం’ అని డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్‌-19 నిపుణులు డాక్టర్‌ డేవిడ్‌ నాబర్రో వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ వెల్లడించింది. మరోవైపు, కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి 12-18 నెలలు పట్టొచ్చని అమెరికాకు చెందిన సాంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్‌ ఆంథోని ఫౌసీ అంచనావేశారు. అయితే ఏడాది నుంచి 18 నెలల కాలంలో ఎప్పడూ ఏ రకమైన వ్యాక్సిన్‌ను రూపొందించలేదని హ్యూస్టన్‌లోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌' డీన్‌ డాక్టర్‌ పీటర్‌ వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనాకు సంబంధించి 102 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. 8 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు.


ప్రపంచానికి రక్షణ లేకుండా వ్యక్తులకు రక్షణ ఉండదు: గుటెరస్‌


ప్రపంచమంతా కుగ్రామంగా మారిన నేటి పరిస్థితుల్లో  ప్రపంచమంతా రక్షణ కల్పించకుండా వ్యక్తులుగా ఎవరికీ రక్షణ ఉండదని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజారోగ్యంపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని బ్రస్సెల్స్‌లో సోమవారం యూరోపియన్‌ యూనియన్‌ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ కనుగొనేందుకు పరిశోధన, అభివృద్ధికి 8.2 బిలియన్‌ డాలర్లు అవసరమని పలు దేశాధినేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. యూరోపియన్‌ కమిషన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలకు భారీగా నిధులు అవసరమని 40 దేశాల అధినేతలు ఇటీవల అభిప్రాయపడ్డారు. కరోనాను ఎదుర్కొనేందుకు గత నెలలో డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలో ఏసీటీ యాక్సిలరేటర్‌ను ఏర్పాటుచేశారు.