చెన్నై,(ఆరోగ్యజ్యోతి): లాక్‌డౌన్ సమయంలో ఇతర రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ రాష్ట్ర సరిహద్దులో 14 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్యంగా ఉన్న కార్మికులను మాత్రమే తమ రాష్ట్రంలోనికి అనుమతి ఇస్తామని, అనారోగ్యంగా ఉన్న కార్మికులను చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన శిబిరాల్లో చికిత్స అందించిన తరువాత కరోనా నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపుతామని తెలిపారు. తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లోని కార్మికులు ఎక్కువగా భవన నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వెళ్లారని అధికారులు తెలిపారు. వెల్లూరు, అనైకట్, కట్పాడి, గుడియట్టం, పెర్నమెంట్ తాలూకాల సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో ఉన్న కార్మికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి చికిత్స అందిస్తుందని వెల్లడించారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారిపై గ్రామ పాలనాధికారులు, పంచాయతీ అధికారులు, సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నేరుగా ఇండ్లకు వెళ్లకుండా తప్పని సరిగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.