- రాష్ట్రంలో కొత్త పాజిటివ్‌లు 21.. గ్రేటర్‌లోనే 20
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర రాజధానిలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్క రోజే గ్రేటర్ పరిధిలో 20 కేసులు నమోదు కాగా, జగిత్యాల జిల్లాలో చాలా రోజుల తర్వాత కొత్తగా ఒక పాజిటివ్ వచ్చింది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1082కు చేరింది. తాజాగా వైరస్ నుంచి మరో 46 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్నవారి సంఖ్య 545కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 508 యాక్టివ్ కేసులున్నాయి.3 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్‌లో ఏకంగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 44 కేసులు వస్తే.. అందులో 40 హైదరాబాద్‌లోనే నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్‌ల పెరుగుదలకు మలక్‌పేట మార్కెట్‌లో వచ్చిన కేసులే కారణమని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒకరిద్దరికి వైరస్ సోకడంతో దాని ప్రభావం వల్ల చాలా మందికి వచ్చింది.జగిత్యాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. రెండు నెలల క్రి తం ముంబై నుంచి వచ్చిన మల్యాల మండలం తక్కళ్లపెల్లికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి తాజాగా కరోనా సోకింది. కేన్సర్‌తో బాధపడుతున్న అతను ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించారు. వనస్థలిపురంలో పాలు సరఫరా చేసే వ్యక్తికి వైరస్ సోకడంతో ఆదివారం ఆ ప్రాంతంలోని 8 కాలనీలను కట్టడి జోన్‌గా మార్చేశారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిపివేయనున్నారు. నివాస ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఒక్క వనస్థలిపురం పరిధిలోనే మూడు కుటుంబాలు వైరస్ బారినపడగా.. మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. హోం క్వారంటైన్‌లో 169 కుటుంబాలను ఉంచారు. హుడాసాయినగర్, సుష్మాసాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్ 1 కాలనీ, సచివాలయ నగర్, ఎస్‌కేడీ నగర్, రైతుబజార్, సాహెబ్‌నగర్ రహదారి ప్రాంతాలను కట్టడి జోన్లుగా మార్చారు.
‘.