వైజాగ్: విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఘటనలో విషవాయువు పీల్చి ఎంబీబీఎస్ విద్యార్ధి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. తమ కుర్రాడు డాక్టరై ఎందరో ప్రాణాలు కాపాడతాడని తల్లిదండ్రులు ఆశించారు. అయితే ఇంతలోనే విషవాయువు విద్యార్ధి ప్రాణాలు తీసింది. చంద్రమౌళి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి తెల్లవారుఝామున మూడున్నర గంటల సమయంలో స్టెరీన్ గ్యాస్ విడుదలైంది. విషవాయువు పీల్చి 10 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థులయ్యారు. అనేక మంది ఇళ్లలోనే స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఎన్డీఎంఏ సహాయక బృందాలు ఇంటింటినీ పరిశీలిస్తూ వారిని బయటకు తీసుకువస్తున్నారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జంతువులు, పక్షులు కూడా విషవాయువుకు బలైపోయాయి.