విశాఖపట్నం: నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఐదు కిలోమీటర్ల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సింహాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకువచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఆరుఐదుగురు మృతి.. 200 మందివరకు అస్వస్థత
కాగా.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ఆరుఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. దాదాపు 200 మందివరకు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా లీకేజీ అదుపులోకి రాలేదు. దీంతో ఎల్జీ పాలిమర్స్, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నారు. ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రాంతాలను మంత్రి అవంతి శ్రీనివాస్, డీఎస్పీ ఉదయ్‌భాస్కర్ సందర్శించారు. ఈ క్రమంలో ఉదయ్ భాస్కర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.