బెంగాల్‌పై కేంద్రం కన్నెర్ర

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్రం మరోసారి ధ్వజమెత్తింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల గుండా అత్యవసర సరుకుల రవాణాను అడ్డుకోవడాన్ని తప్పుబట్టింది. ఈ చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తాయని, వీటివల్ల అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది. ఈమేరకు బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు ఓ లేఖ రాశారు.భారత్‌-నేపాల్‌, భారత్‌-భూటాన్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల మీదుగా నిత్యావసరాల రవాణాను అనుమతించాల్సిందిగా ఏప్రిల్‌ 24న ఇచ్చిన ఆదేశాలను బెంగాల్‌ ప్రభుత్వం పాటించలేదని భల్లా పేర్కొన్నారు. ఆదేశాలను అమలుపరిచినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక అందలేదన్నారు. కాగా, వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదని టీఎంసీ నేత డెరిక్‌ ఓబ్రిన్‌ విమర్శించారు. కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి పీఎం కేర్స్‌ ఫండ్‌లోని డబ్బును ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు.