లక్నో: కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై సడలింపులు ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం అమ్మకాలను ఇప్పటికే షురూ చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్తగా మద్యంపై ‘కరోనా ట్యాక్స్’ను విధించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ‘కరోనా ట్యాక్స్’ను విధించడం వల్ల కొత్తగా 2,350 కోట్ల ఆదాయం సమకూరుతుందని యూపీ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు. లక్నోలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.విధించిన ‘కరోనా ట్యాక్స్’తో దేశీయ బ్రాండ్లపై రూ.5 నుంచి 50 వరకూ మద్యం ధరలు పెరగనున్నట్లు ఖన్నా ప్రకటించారు. విదేశీ బ్రాండ్లపై క్వార్టర్ బాటిల్‌పై 100 రూపాయలు, హాఫ్ బాటిల్‌పై 200 రూపాయలు, హాఫ్ బాటిల్ కంటే ఎక్కువ క్వాంటిటీ కలిగిన బాటిల్స్‌పై 400 రూపాయల వరకూ పెంపు ఉంటుందని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, పెట్రోల్, డీజిల్‌పై కూడా అదనపు వ్యాట్‌ను విధిస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది.దీంతో.. యూపీలో లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయలు, లీటర్ డీజిల్‌పై ఒక రూపాయి ధర పెరిగింది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు. కొత్తగా విధించిన అదనపు వ్యాట్ వల్ల రాష్ట్రానికి రూ.2,070 కోట్ల ఆదాయం సమకూరనుందని మంత్రి తెలిపారు. యూపీలో పెంచిన ధరలతో కలిపి లీటర్ పెట్రోల్ 73.91 రూపాయలు, లీటర్ డీజిల్ 63.86 రూపాయలకు విక్రయించనున్నారు.