జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులు విడుదల

జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి విడుదల

వికారాబాద్‌ ,(ఆరోగ్యజ్యోతి): కప్పుడు ప్రభుత్వాసుపత్రులు అసౌకర్యాలకు నిలయాలుగా ఉండేవి. తిరగని పంకాలు, విరిగిన మంచాలు, కానరాని తాగునీరు, అపరిశుభ్రతతో రోగులు, వారి వెంట వెళ్లిన వారు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఆ తీరు మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తుండటంతో వైద్య సేవలు చాలా వరకు మెరుగుపడ్డాయి. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి తదితర పథకాల అమలుతో సర్కారు దవాఖానాలకు వచ్చే గర్భిణులు, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆసుపత్రుల్లో మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులు విడుదల చేసింది. జిల్లాలోని ఆసుపత్రులకు ఆ నిధులు అందుబాటులోకి వచ్చాయి.


సమస్యల పరిష్కారానికి..
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 154 ఉపకేంద్రాలు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌, మర్పల్లిలో సామాజిక ఆరోగ]్య కేంద్రాలు, తాండూరులో జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. వీటిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఏటా జాతీయ ఆరోగ్య మిషన్‌ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తుంది. వాస్తవానికి ఇవి మార్చిలోపే రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆలస్యమైంది. అన్ని ఆసుపత్రులకు కలిపి రూ.38.92లక్షలు విడుదలయ్యాయి. వాటిని 2021 మార్చి 31లోపు ఖర్చు చేయాలని సూచించింది.



కమిటీ నిర్ణయంతోనే..


నిధుల వినియోగంపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఖర్చు చేసేందుకు వైద్యులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిటీలను గతంలో ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మండల పరిషత్తు అధ్యక్షుడు కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆస్పత్రి వైద్యుడు కన్వీనర్‌గా, ఇద్దరు సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యులుగా ఉంటారు. ఉప కేంద్రాల కమిటీల్లో గ్రామ సర్పంచి అధ్యక్షుడిగా పనిచేస్తారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలకు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా, ఆస్పత్రి డాక్టర్‌ కన్వీనర్‌గా, పురపాలక సంఘం అధ్యక్షుడు కమిటీ సభ్యుడిగా ఉంటారు.


వీటికి వినియోగించాలి..
ఆస్పత్రులకు మంజూరు చేసిన నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తారు. విద్యుత్తు మరమ్మతులు, గోడలకు రంగులు, అవసరమైన ఫర్నిచర్‌ కొనుగోలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఆసుపత్రి ఆవరణలో శుభ్రత, మొక్కలు పెంచేందుకు వినియోగిస్తారు.


కేటాయింపులు ఇలా..
జిల్లా ఆసుపత్రి: రూ.10లక్షలు
సామాజిక ఆరోగ్య కేంద్రాలు (4)
ఒక్కో కేంద్రానికి రూ.2.50లక్షలు
పీహెచ్‌సీలు (22)
ఒక్కో ఆసుపత్రికి రూ. 86,000