వైద్య శాఖలోపోస్టుల భర్తీ!


హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): యుద్ధ ప్రాతిపదికన 3 వేల మంది వైద్య సిబ్బందిని తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స అందించాల్సిన పరిస్థితి రావొచ్చని సర్కారు అంచనా వేస్తోంది. అందుకే తాత్కాలిక పద్ధతిలో వైద్యసిబ్బందిని నియమించాలని నిర్ణయించింది.




మూడు వేల పోస్టుల్లో 800 మంది వైద్యులు, 1500 మంది నర్సులు, 700 మంది సహాయక సిబ్బంది ఉందే అవకాశాలు ఉన్నాయ్.. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కరోనా నేపథ్యంలో  వైద్య సిబ్బంది అవసరం ఎక్కువ ఉంటుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. వైద్యులపై భారం పడకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది. అందుకే కేవలం కొవిడ్‌-19 వైద్య సేవల కోస మే ఒక ఏడాది కాలపరిమితితో సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయమై ఉన్నతాధికారుల తో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల.. 10-15 రోజుల్లో నియామకాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.


ప్రస్తుతం రొటేషన్‌పై విధులు


గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డుల్లో సేవలు అందిస్తున్న సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వైర్‌సకు భయపడి కొంతమంది విధులకు హాజరు కావడం లేదు. నర్సులకు నెలలో 18 రోజులు డ్యూటీ ఉంటే.. మిగిలిన రోజులు సెలవులు ఇస్తున్నారు. వరుసగా ఐదు రోజులు డ్యూటీ చేసిన తర్వాత.. వారికి సెలవు ఇస్తున్నారు. నర్సులు పగటిపూట 6 గంటలు, రాత్రిపూట 12 గంటల పాటు విధులు నిర్వర్తిస్తుండగా... వైద్యులు మాత్రం 24 గంటల పాటు పని చేయాల్సి వస్తోంది. దీంతో వైద్య సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. దాన్ని తగ్గించేందుకే కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.