హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): సమాజంలో ఎంతోమంది యువకులు ఇతడిలాగే ఆలోచిస్తూ వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. తీరా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలడంతో షాక్ అవుతున్నారు. ముఖ్యంగా యుక్త, మధ్యవయస్కుల్లో కొందరిలో మాత్రమే స్పష్టంగా లక్షణాలు కనిపిస్తుండగా, ఎక్కువమందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. తీరా పరీక్షలుచేయిస్తే వైరస్ నిర్ధారణ అవుతున్నది. చిన్నారులు, పెద్ద వయసువారిలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటున్నప్పటికీ, ఇటీవల 20 నుంచి 50 ఏండ్లవారిలో కరోనా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. నిజానికి వైరస్ వల్ల పదేండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారు, దీర్ఘకాలిక సమస్యలున్నవారు ప్రభావితమవుతున్నారని డబ్ల్యూహెచ్‌వోతోపాటు ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఆ దిశగా చర్యలు చేపట్టాయి. అయితే యువత నిర్లక్ష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా యువతలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా పెరగడంతో యువత జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా యువత మరణాలు
అమెరికా, బ్రెజిల్, భారత్‌లో నమోదైన కేసులు, మరణాల్లో యువత, మధ్య వయస్కులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మన దేశంలో నమోదైన కేసులు పరిశీలించినా 15 నుంచి 59 ఏండ్లవారు వైరస్ బారినపడటం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇక మరణాల్లో 48శాతం వరకు ఈ వయసువారు ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మరణించిన ప్రతి ముగ్గురిలో ఒకరు 45-59 ఏండ్లవారే.
వైరస్ వాహకులుగా యువత
నిత్యావసరాలు, ఉపాధి, ఉద్యోగం తదితర కారణాలతో యువత బయట తిరుగుతున్నారు. ఈ సమయంలో చాలామంది మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్లు వినియోగాన్ని పకడ్బందీగా పాటించటం లేదు. దీంతో వైరస్ యువతను ఆధారంగా చేసుకొని వ్యాప్తిస్తున్నది. కరోనా వైరస్ సోకినప్పటికీ యువతలో లక్షణాలు కనిపించకపోవడం పెద్ద సమస్యగా మారుతున్నది. వైరస్‌ను గుర్తించేలోగా ఇంట్లో ఉన్న చిన్నారులు, పెద్దలకు వ్యాప్తి జరుగుతున్నదని పేర్కొంటున్నారు. వారికి తెలియకుండానే వైరస్‌కు వాహకంగా మారుతున్నారని, అందుకే యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- యువత తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి. బయటికి వెళ్లొస్తే వైరస్ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్నదని గుర్తించాలి.
- బయట తిరిగేవారు చిన్నారులు, పెద్దలకు దూరంగా ఉండాలి. మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలి.
- విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి.
- వైరస్ తమకు సోకదు అనే అపనమ్మకాన్ని వీడాలి. రోగనిధకశక్తి పెంచే ఆహారం తీసుకోలి. యోగా, వ్యాయామం చేయాలి.