ఆదిలాబాద్ లో కరోన కాల్ సెంటర్ ప్రారంబం
సలహాలు సూచనలకు కాల్ చేయండి
ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాటోడ్ నరేందర్
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి):‘హలో మీ ఆరోగ్యం ఎలా ఉంది.. నిన్నటి కంటే కాస్త మెరుగైందా.. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తగ్గిపోతుంది’ అంటూ కరోనా పాజిటివ్ బాధితులకు హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి ధైర్యాన్నిస్తున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి వైద్యులు, సిబ్బంది హోం ఐసొలేషన్‌లో ఉన్న వ్యాధిగ్రస్తులకు ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. తమ సూచనలు, సలహాలు పాటిస్తే వైరస్ మటుమాయమవుతుందని వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రతి రోజూ బాధితులకు వీడియో కాల్ చేసి ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని సూచిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా కొవిడ్-19 రోజురోజుకూ విజృంభిస్తున్నది. ఎక్కువ మంది కరోనా పాజిటివ్ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాటోడ్ నరేందర్ ప్రారంబించారు. కరోనా వ్యాధి ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సౌకర్యార్థం ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కాల్సెంటర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందని ఆయన తెలిపారు. కాల్ సెంటర్ లో ఒక డాక్టర్ తో పాటు మెడికల్ పారామెడికల్ సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారన్నారు. మొబైల్, వాట్స్అప్ వీడియోకాల్ సౌకర్యం ద్వారా కరోనా వ్యాధికి సంబంధించిన ఎటువంటి అనుమానం గురించి అయినా ఈ కాల్ సెంటర్ సంప్రదించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎహ్ఓ డాక్టర్ సాధన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు హెల్ప్‌డెస్క్‌తో ధైర్యం..
హోం ఐసొలేషన్‌లో ఉంటున్న కరోనా పాజిటివ్ బాధితులకు వైద్యాధికారులు ఫోన్ చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ ధైర్యాన్ని నూరిపోస్తున్నా రు. పాజిటివ్ నిర్ధారణ జరిగి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం17 రోజుల వరకు ఇంటిలో ప్రత్యేకమైన గదిలో ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ బయ టకు రావొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు 7382726029, 08732-220462 నంబర్ల లో సంప్రదించాలని కోరుతున్నారు.
వాట్సాప్ వీడియో కాల్!
వాట్సాప్ వీడియో కాల్ ద్వారా హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. నేరుగా వీడియో ద్వారా బాధితులను వీక్షించి వైద్యులు సేవలందిస్తున్నారు. బాధితుల సమస్యను తెలుసుకొని సలహాలు ఇస్తూ వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు.