పిల్లలపై న్యుమోనియా నీడలు

 


 



 


పిల్లలపై న్యుమోనియా నీడలు కమ్ముకుంటున్నాయి. కరోనాకు చలి ప్రభావం తోడవ్వడంతో ఈ వ్యాధి చిన్నారులను గడగడలాడిస్తున్నది. ముఖ్యంగా ఈసారి చలితీవ్రత అధికంగా ఉండటంతో పిల్లల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నట్లు నిలోఫర్‌ చిన్నపిల్లల విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఉషారాణి తెలిపారు. చలి పులి పంజా విసురుతున్నది. చిన్న పిల్లలను న్యుమోనియా వెంటాడుతున్నది. కరోనాకు చలి ప్రభావం తోడవ్వడంతో న్యుమోనియా కోరలు సాచుతున్నది. ఇప్పటికే నగరంలో 30శాతం మంది చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతున్నది. ప్రతిరోజు నిలోఫర్‌ దవాఖానకు దాదాపు 80మంది చిన్నారులు న్యుమోనియాతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వస్తున్నారు. కేవలం నిలోఫర్‌ లోనే ఇలా ఉంటే నగర వ్యాప్తంగా ఉన్న దవాఖానల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు వ్యాధి తీవ్రత ముదరక ముందే వైద్యులను సంప్రదించాలని, నిర్లక్ష్యం చేస్తే పిల్లల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. తల్లిపాలతో న్యుమోనియాను అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. నేడు ప్రపంచ ‘న్యుమోనియా’ దినం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..


పిల్లలకు సంబంధించిన వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది న్యుమోనియానే అని, దీనివల్లనే 5 ఏండ్లలోపు పిల్లల్లో మరణాల రేటు అధికంగా ఉంటుందన్నారు. ఈ వ్యాధి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 2.5 మిలియన్ల మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. గ్రేటర్‌లో 30శాతం మంది పిల్లలు ఈ న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు ఐఏపీ(ఇండియన్‌ అకాడమి ఆఫ్‌ పీడియాట్రిక్‌)వర్గాలు చెబుతున్నాయి. నగరంలోని నిలోఫర్‌ దవాఖానకు ప్రతిరోజు ఓపీ కోసం సుమారు 500మంది రోగులు వస్తే వారిలో 50నుంచి 80కేసులు న్యుమోనియాకు సంబంధించి ఉంటున్నట్లు నిలోఫర్‌ ఓపీడీ ఇన్‌చార్జి, ఆర్‌ఎంఓ డాక్టర్‌  రమేశ్‌ దాంపురి తెలిపారు. వీరిలో రోజుకు సుమారు 10నుంచి 12మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తుండగా, మిగిలిన వారికి ఓపీలో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. 


ఇది కేవలం నిలోఫర్‌ దవాఖానకు సంబంధించిన లెక్కలు మాత్రమేనని తెలిపారు. ఇక చిన్నపిల్లలకు సంబంధించిన క్లీనిక్‌లు, దవాఖానల్లో ఈ కేసులు అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికా వంటి దేశాల్లో ఇన్‌ఫ్లుయంజా, రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌ (ఆర్‌సీవీ)వంటి వైరస్‌లతో న్యుమోనియా సంక్రమిస్తే మన దేశంలో ట్యూబర్‌కిలోసిస్‌ అనే బ్యాక్టీరియా ద్వారా ఎక్కువ సంక్రమిస్తుందని వైద్యులు తెలిపారు. పిల్లల్లో న్యుమోనియా వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగి ప్రమాదస్థాయికి చేరుకుంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహణ లేకపోవడంతో రోగుల సంఖ్య, మరణాల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2009 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 12న ప్రపంచ న్యుమోనియా దినంగా పరిగణిస్తున్నారు. 


ఎలా సోకుతుంది? 



  • బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌లతో పాటు ఇన్‌ఫ్లూయెంజా, రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌ (ఆర్‌సీవీ)ల వల్ల న్యుమోనియా వ్యాధి సోకుతుంది.  స్ట్రెప్టోకోకస్‌ బ్యాక్టీరియాతో కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. న్యుమోనియాలో రెండు రకాలు ఉన్నాయి.

  • 1. బ్యాక్టీరియాతో వచ్చే న్యుమోనియా

  • 2. వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌. అంటే సమాజంలో కలిగే మార్పుల వల్ల వచ్చే న్యుమోనియా. దీన్ని కమ్యూనిటీ అక్యైర్డ్‌ న్యుమోనియా అంటారు. వాతావరణంలో కలిగే మార్పులు, ఇన్ఫెక్షన్‌ల వల్ల వస్తుంది. 

  • దవాఖానల్లోని ఇన్ఫెక్షన్‌ల వల్ల వచ్చే న్యుమోనియాను హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్‌ న్యుమోనియా అంటారు. ఇది దవాఖానల్లో చేరినప్పుడు అక్కడి ఇన్ఫెక్షన్‌లు లేదా ఇన్‌ఫ్లుయంజాతో బాధపడే వారి నుంచి సోకుతుంది. ముఖ్యంగా 5సంవత్సరాల లోపు పిల్లలకు, హెచ్‌ఐవీతో బాధపడే పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిలోఫర్‌ వైద్యులు తెలిపారు. 


వ్యాధి లక్షణాలు



  • నిమిషానికి 30సార్లకంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకోవడం

  • పొత్తికడుపు, ఛాతిలో నొప్పి

  • నోటి చుట్టూ చర్మం 

  • నీలిరంగుకు మారడం

  • పక్కలు ఎగేయడంn ఆయాసం

  • తీవ్రమైన జ్వరం

  • ఊపిరి పీల్చుకోవడంలో అస్వస్థత

  • దగ్గు 


న్యుమోనియాను అడ్డుకునే వ్యాక్సిన్‌లు ఇవే



  • బీసీజీ 

  • పెంటావ్యాక్‌ 

  • హిబ్‌ 

  • న్యుమోకోకల్‌ 

  • మిజిల్స్‌ 

  • ఫ్లూ షాట్‌


65 ఏండ్లు దాటిన వారికి ప్రమాదమే..


ప్రపంచంలో శిశువులు, వృద్ధుల మరణాలకు పెద్ద ఎత్తున కారణమవుతున్న అతి పెద్ద సంక్రమిత వ్యాధుల్లో న్యుమోనియా ఒకటి. ఊపిరితిత్తుల్లో నీరు చేరి బాధితులకు ఊపిరందని పరిస్థితి తలెత్తుతుంది. 65ఏండ్ల వయస్సు దాటిన వారికి రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ముప్పు అధికంగా ఉంటుంది. పొగాకు, మద్యం సేవించే వారు చలి కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో ఉంది.  - డాక్టర్‌ రఘుకాంత్‌, పల్మనాజిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి. 


తల్లిపాలతో న్యుమోనియాను అడ్డుకోవచ్చు


సాధారణంగా తల్లిపాలతో బిడ్డలో రోగ నిరోధక శక్తి స్వతహాగా పెరుగుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో న్యుమోనియాను ఆరుసార్లు అడ్డుకునే శక్తి శిశువులో ఉంటుంది. ప్రభుత్వం టీకాలను పిల్లలకు పూర్తి ఉచితంగానే ఇస్తుంది. వ్యాక్సినేషన్‌ 80శాతం దాటితే న్యుమోనియా బారినుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. చల్లగాలి, పొగ, పెద్దవారిలో ఉన్న ఇన్ఫెక్షన్స్‌ ద్వారా పిల్లలకు న్యుమోనియా సోకుతుంది. 5 ఏండ్లలోపు వయస్సుగల పిల్లల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. గతంలో ప్రధానిని కలిసినప్పుడు న్యుమోకోకల్‌ను ప్రభుత్వ టీకా షెడ్యూల్‌లో చేర్చాలని కోరాను. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రారంభదశలోనే హాస్పిటల్‌కు తీసుకువస్తే 99శాతం నయం చేయవచ్చు. ఆలస్యమైతే ప్రమాదం. - డాక్టర్‌ ఉషారాణి, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్‌ విభాగాధిపతి.