మాదాపూర్ (ఆరోగ్యజ్యోతి) : గర్భిణులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, అపోహలను నివృత్తి చేసేందుకు వైద్య నిపుణురాలు శిల్పిరెడ్డి ఆధ్వర్యంలో డిసెంబర్ 20న ‘మిసెస్ మామ్స్-20’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ దవాఖానలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శిల్పిరెడ్డి మాట్లాడారు. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో అనేక ఒత్తిడిలకు గురవుతుంటారని, కొందరిలో అనేక అనుమానాలు తలెత్తుతుంటాయన్నారు. వాటన్నింటినీ జయించి సాధారణ ప్రసవం జరిగేలా సలహాలు, సూచనలు తెలియజేస్తామన్నారు. సిజేరియన్ ప్రసవాలకు గర్భిణులు సరైన ఆహారం తీసుకోకపోవడంతోపాటు వ్యా యామం చేయకపోవడమే కారణమని వివరించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ డిసెంబర్ 20న గచ్చిబౌలిలోని లీ మెరీడియన్ హోటల్‌లో మిసెస్ మామ్స్-20 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ఇంట్లో ఉండి వీక్షించాలనుకునే వారి కోసం యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మిసెస్ మామ్స్-20 లోగోను కిమ్స్ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో యాపిల్ హోమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమా ఆర్య, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాన్సి ఉప్పాల, మిర్రర్ సెలూన్, అకాడమీ వ్యస్థాపకురాలు డాక్టర్ విజయలక్ష్మి, డెర్మటాలజీ నిపుణురాలు నవ్య, డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.