చలికాలం.. కరోనాకు కలిసొచ్చే కాలం

అమరావతి(ఆరోగ్యజ్యోతి) : చలికాలం వచ్చేసింది.. కరోనా మరింతగా వ్యాప్తి చెందే కాలం ఇది.. అందుకే ఈ చలికాలమంతా అంటే ఫిబ్రవరి చివరి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పైగా పండుగల సీజన్‌ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయి మళ్లీ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సమస్యను అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణుడు, కరోనా కంట్రోల్‌ సెంటర్‌ అధికారిగా పనిచేసిన డాక్టర్‌ ప్రభాకరరెడ్డి. రాష్ట్రంలో కరోనా మొదటి వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుతోందని, సెకండ్‌ వేవ్‌ వచ్చేసరికి సమయం పడుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చలికాలం దోహదపడే అవకాశం ఉన్నందున భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం, శానిటైజేషన్‌ వంటివి విధిగా పాటించాల్సిందేనంటున్నారు. పట్టణాల్లో కొంతవరకూ హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందని, పల్లెల్లో రానందున పల్లె ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ ప్రభాకరరెడ్డి హెచ్చరిస్తున్నారు.