హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 45.75 లక్షలకు చేరుకున్నాయి. శుక్రవారం 44 వేల టెస్టులు నిర్వహించగా, 1,607 మందికి పాజిటివ్‌గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 296 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 113, రంగారెడ్డిలో 115 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో రికవరీ రేటు 91.43 శాతంగా నమోదవగా, దేశవ్యాప్తంగా 92.3 శాతంగా ఉన్నది. ఒకవైపు చలికాలం, మరోవైపు పలు దేశాలు సెకండ్ వేవ్‌తో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. కొవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించరాదని, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది. స్వల్ప లక్షణాలు కనిపించగానే సమీపంలోని కరోనా పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని, పాజిటివ్ రిపోర్టు వస్తే వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వ్యాక్సిన్ వచ్చేవరకు మాస్క్, భౌతికదూరం, పరిశుభ్రతలే ఆయుధాలని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని విస్మరించకూడదని హెచ్చరించింది.