వ్యాయామంతోనే ఆరోగ్యం

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): క్రీడలు, వ్యాయామంతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ గోపాల్‌నగర్‌ కాలనీ రెసిడెన్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారావు, రాష్ట్ర స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, జాతీయ బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ హాజరై రన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం 5కే రన్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదన్నారు. నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతిభచాటే క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తర్ఫీదునిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు, డివిజన్‌ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి, అడుసుమల్లి వెంకటేశ్వర్‌రావు, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు జలగం చైతన్య, సైదుబాబు, శిరీష్‌ పాల్గొన్నారు.