బోధ‌నాస్ప‌త్రుల‌కు 92 మంది అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల ఎంపిక‌

హైద‌రాబాద్(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా బోధ‌నా ఆస్ప‌త్రుల్లో మాన‌వ వ‌న‌రుల కొర‌త‌ను త‌గ్గించేందుకు వైద్య విద్య డైరెక్ట‌రేట్(డీఎంఈ) గొప్ప ముంద‌డుగు వేసింది. తెలంగాణలోని బోధనా ఆసుపత్రులకు చేప‌ట్టిన 92 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల‌ను ఎంపిక ప్ర‌క్రియ‌ను పూర్తిచేసింది. ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లకు న‌వంబ‌ర్ 19న డీఎంఈ-కోఠిలో స‌ర్టిఫికెట్ ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. అనంత‌రం వీరంతా రాష్ట్రంలోని వివిధ బోధనా ఆసుపత్రులలో నియ‌మింప‌బ‌డుతారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న కొవిడ్ -19 మహమ్మారి సంక్షోభం నేప‌థ్యంలో తెలంగాణలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆరోగ్యశాఖ‌ మంత్రి ఈట‌ల రాజేందర్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ  ఆదేశాల నేప‌థ్యంలో అధికారులు నియ‌మ‌క ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. అంత‌కుక్రితం సైతం టీఎస్‌పీఎస్‌సీ అక్టోబర్ నెలలో రాష్ర్టంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించిన 167 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో) కింద పనిచేసేందుకు దాదాపు 205 మంది సిబ్బందిని అకామిడేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య డైరెక్టర్‌కు గత నెలలో అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఆగస్టులో టిమ్స్‌, గాంధీ ఆస్ప‌త్రుల్లో 85 ప్రత్యేక పోస్టులను డీఎంఈ నింపింది. మొత్తం 85 స్పెషాలిటీ పోస్టులలో జనరల్ మెడిసిన్ విభాగంలో 35 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు, అన‌స్థీషియాలో 35 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు అదేవిధంగా టీబీ అండ్ కమ్యూనికేషన్ డిసీజెస్ (పల్మనరీ) రంగంలో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్లు నెలకు రూ .1.25 లక్షల‌ వేతనంతో నియ‌మించింది.