కరోనా వైరస్ నియంత్రణ కోసం స్పుత్నిక్ టీకాను రష్యా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆదేశం ఆ టీకాను మార్కెట్లోకి కూడా విడుదల చేసింది. అయితే కోవిడ్19 రోగుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ సుమారు 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. అంతర్గతంగా నిర్వహించిన ట్రయల్స్ ఫలితాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. రష్యాకు చెందిన ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని చెప్పింది. కొన్ని రోజుల క్రితమే అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ .. తాము రూపొందించిన కోవిడ్ టీకా 90 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్.. ఇండియాలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్వహిస్తోంది. మన దేశంలో స్పుత్నిక్-వి టీకాను కూడా రెడ్డీస్ ల్యాబ్ సరఫరా చేయనున్నది. రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) గతంలో ఈ ఒప్పందంపై ప్రకటన చేసింది. ఒకవేళ తమ వ్యాక్సిన్‌కు భారత్‌లో ఆమోదం దక్కితే, అప్పుడు సుమారు వంద మిలియన్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌కు సరఫరా చేయనున్నట్లు ఆర్‌డీఐఎఫ్ ఈమధ్యే పేర్కొన్నది.