కరోనా భయంతో ఫిజియోథెరపిస్టు ఆత్మహత్య

చెన్నై (ఆరోగ్యజ్యోతి) : తమిళనాడులోని చిన్నానపట్టిలో కరోనా భీతితో ఓ ఫిజియోథెరపిస్టు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినాడు. నామక్కల్‌ జిల్లా పరమత్తివెల్లూరుకు చెందిన చిన్నసామి (44) బెంగుళూరులోని అపోలో వైద్యశాలలో ఫిజియోథెరపిస్ట్‌ పనిచేస్తున్నాడు. ఉమావతి స్వగ్రామం సెంబట్టిలో వీరు నివసిస్తున్నారు. బెంగుళూరులో పనిచేస్తున్న చిన్నసామికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, తాను గ్రామానికి వస్తున్నట్టు భార్యకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. బెంగుళూరు నుంచి బైక్‌పై వచ్చిన చినసామి ఇంటికి వెళ్లకుండా సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లాడు. మోటార్‌సైకిల్‌ సీటుపై సూసైడ్‌ నోట్‌, దానిపై సెల్‌ఫోన్‌ ఉంచిన తరువాత, ఆ మార్గంగా వచ్చిన రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిండుగల్‌ రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.