న్యూఢిల్లీ, : దేశంలో మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే దవాఖానల స్థాపనకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నూతన నియమావళిని విడుదల చేసింది. మెడికల్ కళాశాల, దవాఖాన స్థాపనకు కచ్చితంగా ఐదెకరాల భూమి ఉండాలన్న నియమాన్ని రద్దుచేసింది. నైపుణ్యాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేసింది. అనుబంధ దవాఖానల్లో పడకల సంఖ్యను కూడా కుదించింది. ఎంసీఐ 1999లో తెచ్చిన ‘మెడికల్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు’ అనే నియమావళిని పూర్తిగా రద్దుచేసింది. కొత్త నియమాలు 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
కొన్ని మరింత కఠినం
ఒకేసారి మెడికల్ కాలేజీతోపాటు దానికి అనుబంధ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు గతంలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, అది పూర్తి స్థాయిలో రెండేళ్లుగా నడుస్తూ ఉంటేనే కొత్త మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించారు. అలాగే వ్యక్తుల పేరిట ఉండే ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా కాలేజీలకు అనుమతినివ్వరు. గ్రూపు, ట్రస్టుల ఆధ్వర్యంలో ఉండే ఆస్పత్రులకు మాత్రమే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తారు. మెడికల్ కాలేజీ, ఆస్పత్రి రెండూ ఒకే క్యాంప్‌సలో ఉండాలనే నిబంధనను విధించింది. కొన్ని మెడికల్ కాలేజీల క్యాంపస్ ఆవరణలోనే ఇంజనీరింగ్, ఇతర విద్యా సంస్థలు నడుస్తుంటాయి. ఇక నుంచి అటువంటి వాటికి అవకాశం ఉండదు.కాగా, ఈ నిబంధనలన్నీ కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయదలుచుకున్న వాటికి మాత్రమే వర్తించనున్నాయి. ప్రస్తుతమున్న వైద్య విద్య కళాశాలలు తమ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుకోదలిస్తే... వాటికి కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను బోధానాస్పత్రులుగా మార్చేందుకు అవకాశం ఇచ్చింది. వైద్య విద్యార్ధులకు ఫిజికల్ మెడిసిన్‌ను తప్పనిసరి చేశారు. స్కిల్ లేబరేటరీ ఏర్పాటును కూడా తప్పనిసరి చేశారు. గతంలో కనీసం 20 ఎకరాల భూమి నిబంధన ఉండేది. విద్యార్ధుల చదువు, మౌలిక వసతులకు అవసరమైనంత ఉంటే చాలు.
కొత్త నియమావళిలో కీలకాంశాలు
- మెడికల్ కళాశాల, అనుబంధ దవాఖాన స్థాపనకు కచ్చితంగా ఐదెకరాల భూమి ఉండాల్సిన అవసరం లేదు.
- దేశంలోని మొదటి, రెండో స్థాయి నగరాలు, ఈశాన్య రాష్ర్టాల్లోని కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాల్లో మెడికల్ కళాశాల స్థాపనకు అవసరమైన భూమి మొత్తం ఒకే చోట ఉండాల్సిన అవసరంలేదు. రెండుచోట్ల ఉన్నా సరిపోతుంది. అయితే ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం పది కిలోమీటర్లు మించకూడదు.
- 200 మంది విద్యార్థులుండే కాలేజీలో ల్యాబోరేటరీ కనీసం 800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండాలి.
- వంద సీట్లున్న మెడికల్ కళాశాలకు చెందిన అనుబంధ దవాఖానలో కనీస పడకల సంఖ్యను 430కి తగ్గించారు.