వరంగల్ (ఆరోగ్యజ్యోతి) : శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా.. ప్రజల శ్రేయస్సే పరమావధిగా ఖాకీ డ్రెస్సు, చేతిలో లాఠీ పట్టుకుని కరుకుగా కనిపించే మన పోలీసుల్లో కారుణ్యం కూడా ఉందని నిరూపించారు. పోలీస్ అమరవీరుల ఆశయాలకు తగ్గట్లుగా వారి త్యాగాలను గౌరవిస్తూ ఆపదగొన్న వారికి ప్రాణం పోసే బృహత్తర కార్యక్రమం తలపెట్టి సక్సెస్ అయ్యారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కోసం నిర్వహించిన ‘ఫ్లాగ్ డే’ను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా యువజన సంఘాలతో కలిసి పోలీసులు సైతం రక్తదానం చేసి ప్రాణాపాయస్థితిలో ఉండేవారికి ‘మేమున్నాం’అనే ధైర్యం కల్పించారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,433 యూనిట్ల రక్తం సేకరించి, బ్లడ్ బ్యాంకులకు అందించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయగా రెడ్‌క్రాస్ సొసైటీ, ఎంజీ ఎం బ్లడ్‌బ్యాంక్, జనగామ ప్రభుత్వ వైద్యశాలకు సేకరించిన రక్తాన్ని తరలించారు. కమిషనరేట్ పరిధిలో ఏఆర్, ట్రాఫిక్ పోలీసులు హెడ్‌క్వార్టర్‌లో, హన్మకొండ డివిజన్ పోలీసులు హంటర్‌రోడ్డులోని విష్ణు ప్రియగార్డెన్‌లో, కాజీపేట డివిజన్ పోలీసులు 100 ఫీట్ల రోడ్డులోని పీజీఆర్ గార్డెన్‌లో, వరంగల్ డివిజన్ పోలీసులు రాజశ్రీ గార్డెన్‌లో, వర్ధన్నపేట ఏసీపీ రమేశ్, మామునూర్ నాలుగు, ఐదో బెటాలియన్ కమాండెంట్ వెంక య్య తమ పరిధిలో శిబిరాలు ఏర్పాటు చేశారు. పరకాల, ము లుగు, ఏటూరునాగారం, జయశంకర్ భూపాలపల్లి పోలీసులు హెడ్‌క్వార్టర్స్ లో నిర్వహించారు. యువత పెద్ద మొత్తం లో భాగస్వామ్యమయ్యేలా చేశా రు. అధికారి నుంచి హోంగార్డు వరకు రక్తదానం చేసి తక్కువ సమయంలో కావాల్సినంత రక్తాన్ని బ్లడ్‌బ్యాంక్‌లకు తరలించారు.
2,433 యూనిట్ల రక్తసేకరణ
14 రక్తదాన శిబిరాల్లో ఐదు ఎంజీఎం బ్లడ్‌బ్యాంకు, ఎనిమిది రెడ్ క్రాస్ సొసైటీ, ఒకటి జనగామ ప్రభుత్వ వైద్యశాల నిర్వహించింది. రెడ్‌క్రాస్ సొసైటీకి 1,326 యూనిట్లు, ఎంజీఎం బ్లడ్ బ్యాంకుకు 950 యూనిట్ల రక్తాన్ని పోలీస్‌శాఖ అప్పగించింది. పది రోజుల్లోనే పెద్ద మొత్తంలో రక్తం సేకరించడంపై బ్లడ్‌బ్యాంకు ప్రతినిధులు అభినందనలు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావు, ఎంజీఎం బ్లడ్ బ్యాంకు మోటివేటర్ కల్యాణి పర్యవేక్షణలో రక్తదాన శిబిరాలు కొనసాగాయి. రక్తదాతలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆధ్వర్యంలో పండ్లు అందించారు.