కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పింది. 2021 జనవరి నాటికి తమ వాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రానున్నామని సంస్థ స్పష్టం చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, బ్రిటీష్ సంస్థ ఆశ్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ 2021, జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ట్రయల్స్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదాలు సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని.. భారత్, యూకేలలో జరుగుతున్న పరీక్షల ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని చెబుతూ ఉన్నారు. కొవీషీల్డ్‌కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్ షాట్ లభించిందని అంటున్నారు పూనావాలా. 60 నుంచి 70 లక్షల మోతాదుల తయారీ లక్ష్యంగా తమ సంస్థ ఉందట..! వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నెలకు కోటి మోతాదుల వ్యాక్సిన్‌లను తయారు చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. టీకాను అందుబాటు ధరకు మార్కెట్ లోకి తెచ్చేలా ప్రభుత్వంతో సీరం చర్చలు జరుపుతోందని.. అందరికీ అందుబాటు ధరలో టీకాను అందించాలని పూనావాలా స్పష్టం చేశారు.