మినరల్‌ కంటే భగీరథ నీరే సురక్షితం

- ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్


హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): మార్కెట్‌లో దొరికే మినరల్‌ వాటర్‌ కంటే గ్రా మాల్లో ఇంటింటికీ సరఫరా అవుతున్న మిషన్‌ భగీరథ నీరే సురక్షితమైందని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన అత్యున్నత ప్రమాణాలతో భగీరథ నీటిని శుద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎర్రమంజిల్‌లోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో చీఫ్‌ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్‌ఈలతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ స్థిరీకరణ పనులను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్‌ నుంచి ఆమ్రాబాద్‌ వరకు ఉన్న ఆదివాసీగూడేలు, లంబాడ తండాలకు భగీరథతో రక్షిత తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఇంకా మిగిలిన 126 ఐసొలేటెడ్‌ (అటవీ, గుట్టల ప్రాం తాల్లో ఉండే) ఆవాసాల్లో జరుగుతున్న నీటి సరఫరా పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో మిషన్‌ భగీరథ వాటర్‌బాటిళ్లను వినియోగించడంపై అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఇకపై నిర్వహించే సమావేశాల్లోనూ కచ్చితంగా భగీరథ బాటిళ్ల నీటినే వాడాలని చెప్పారు. ఈఎస్‌సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్‌, మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.