- రిమ్స్‌లో విజయవంతంగా నడుస్తున్న డయాలసిస్ కేంద్రం
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి); రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్‌లో డయాలసిస్ సెంటర్‌ను ఫిబ్రవరి 21, 2018న ప్రారంభించింది. అప్పటి మంత్రులు లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ఐకే రెడ్డి కలిసి డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం చేశారు. కిడ్నీ బాధితుల చికిత్స కోసం రూ.కోటితో అధునాతన పరికరాలు అమర్చారు. ఒక్కో మిషన్ రూ.10 లక్షలు విలువ ఉంటుంది. డయాలసిస్ సెంటర్ నిర్వహణకు ‘డీమెట్' సంస్థ ద్వారా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. సెంటర్‌లో పదిమంది సిబ్బంది ఉన్నారు. ఆరుగురు టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఇన్‌చార్జి విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎంవో పోస్టు ఖాళీగా ఉన్నది. ఈ సెంటర్ హెచ్‌వోడీగా తానాజీ వ్యవహరిస్తున్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు.డయాలసిస్ సెంటర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 71 మందికి 639 సార్లు సైక్లింగ్ (రక్త శుద్ధీకరణ) చేశారు. ఒక్కో వ్యాధిగ్రస్తుడికి వారంలో రెండు నుంచి మూడు సార్లు సైక్లింగ్ చేస్తారు. ఒక్కసారి సైక్లింగ్ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. రోగికి రూ.1800 నుంచి రూ.2500 విలువైన వ్యాక్సిన్లు ఇస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చేస్తున్నారు. గతంలో జిల్లాకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవాలంటే మహారాష్ట్రలోని నాగ్‌పూర్, యవత్‌మాల్, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఎటు వెళ్లినా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉండేది. పైగా ఆర్థిక భారం ఎక్కువయ్యేది. దీంతో ఇటు శారీరకంగా, అటు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. కొంత మంది చికిత్సలు చేయించుకోలేక ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. రిమ్స్‌లో ఏర్పాటైన డయాలసిస్ సెంటర్‌తో రోగులకు ఊరట కలిగింది. అధునాతన సౌకర్యాలతో విజయవంతంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22,846 మంది కిడ్నీ రోగులకు విడుతల వారీగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 71 డయాలసిస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం..
అధిక మోతాదులో మందులు వాడడంతో కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏ రోగం వచ్చినా ఎంబీబీ ఎస్ వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలి. చాలా తక్కువ మందికి కిడ్నీ వ్యాధి వంశపారం పర్యంగా వస్తుంది. కిడ్నీ మార్పిడి కోసం నిమ్స్‌కు రెఫర్ చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి నిమ్స్ ప్రత్యేక వైద్యబృందం రిమ్స్‌లోని డయాలసిస్ సెంటర్‌ను సందర్శిస్తారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డయాలసిస్ అవసరమైన వారు ఆరోగ్యశ్రీలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్రూవల్ రాగానే చికిత్స చేస్తాం. ఒక వేళ రాకపోయినా చికిత్స అందిస్తున్నాం. డయాలసిస్ సెంటర్‌లో రోగులకు ఎలాంటి ఇబ్బందులున్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చు.
- డాక్టర్ తానాజీ, డయాలసిస్ సెంటర్ హెచ్‌వోడీ, రిమ్స్